పంట పొలంలో విషాదం

2 Jun, 2020 08:48 IST|Sakshi

పిడుగుపాటుకు ముగ్గురి మృతి 

వీరిలో ఇద్దరు రైతులు, ఒక ఉపాధ్యాయుడు  

వర్షానికి పొలంలోని  పూరిపాకలో తలదాచుకున్న సమయంలో కాటేసిన మృత్యువు

ఎస్సీమరువాడ,  చినతోలుమండగూడలో విషాదం 

పంట పొలంలో సోమవారం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. సాయంత్రమయ్యేసరికి ఉరుములతో కూడిన చిరుజల్లులు మొదలయ్యాయి. తలదాచుకునేందుకు అందరూ పొలంలో ఉన్న పూరిపాకలోకి వెళ్లారు. కాసేపటికే...వారుండే పాకపై పెద్దశబ్దంతో కూడిన అగ్గిపిడుగు పడింది. అంతే... అందులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో రైతులిద్దరూ అన్నదమ్ములు కాగా.. ఇంకొకరు ఉపాధ్యాయుడు. 

జియ్యమ్మవలస: మండలంలోని ఎస్సీమరువాడ, చినతోలుమండ గూడకు మధ్యలో ఉండే పంట పొలాల్లో మృత్యుకేకలు ఘోషించాయి. పిడుగు పాటుకు ఎస్సీ మరువాడకు చెందిన బెలగాపు పారయ్య(62), బెలగాపు పండయ్య(52), చినతోలుమండగూడకు చెందిన ఉపాధ్యాయుడు సీమల నాగభూషణం(36)లు దుర్మరణం చెందారు. పండయ్య భార్య రమణమ్మ, కుమార్తెలు నయోమి, సాత్వికలు ప్రమాదం నుంచి బయట పడ్డా రు. వీరంతా పత్తిచేను లో పనిచేస్తున్నారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో అక్కడే ఉన్న పూరిపాకలోకి వెళ్ళారు. అదే సమయంలో పిడుగు పడడంతో పారయ్య, పండయ్య, నాగభూషణంలు దుర్మరణం చెందారు. పండయ్య భార్య, పిల్లలు స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు.

రైతులైన పారయ్య, పండయ్యలు అన్నదమ్ములు. ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చినతోలుమండగూడకు చెందిన భూషణంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాఠశాలకు సెలవు కావడంతో పొలం పనికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యాడు. గూడలోని పిల్లలను విద్యావంతులు చేస్తున్న ఉపాధ్యాయుడి మృతితో గ్రామస్తులు కలతచెందుతున్నారు. చినమేరంగి ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా