అయ్యో.. బిడ్డల్లారా..

23 May, 2020 13:45 IST|Sakshi
గంగవ్వ, కూతుళ్లు్ల సంజన, అశ్విని(పిల్లలు చికిత్స పొందుతున్నారు)లతో మృతులు లక్ష్మి, శ్రీనివాస్‌(ఫైల్‌)

తగిలేపల్లిలో తీరని విషాదం

ఇంటి గోడకూలి ముగ్గురి దుర్మరణం

మృతుల్లో భార్యాభర్తలు వారి ఏడాది కుమారుడు

తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారులు

వర్ని(బాన్సువాడ): ఆ కుటుంబానికి ప్రభుత్వం ‘డబుల్‌ బెడ్‌రూం’ మంజూరు చేసింది. మొదటి అంతస్తులో కేటాయించడంతో తన భార్య గర్భిణి అనీ ఇబ్బంది అవుతుందని వేడుకోవడంతో ఖాళీ స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. సోమవారం గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు. అంతలోనే తీరని విషాదం నెలకొంది ఆ కుటుంబంలో.. ప్రస్తుతమున్న అద్దె ఇంటి గోడకూలి భార్యాభర్తలు, శ్రీనివాస్‌(34), లక్ష్మి(30), వారి ఏడాది కుమారుడు సాయికుమార్‌ దుర్మరణం చెందారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వర్ని మండలం తగిలే పల్లిలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచి వేసింది. మంజూరైన డబుల్‌ బెడ్‌రూంలోకే వెళ్తే బతికేవారేమో... అయ్యో పాపం మరో మూడ్రోజుల్లో కొత్తింటిలోకి వెళ్లేవారు కదా అంటూ తమ వేదనను ఒకరికొకరు పంచుకున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తగిలేపల్లికి చెందిన మనిగిరి లక్ష్మి, గాంధారి మండలం చద్మల్‌కు చెందిన శ్రీనివాస్‌ బంధువుల ఇళ్లలో తరచూ కలవడంతో ఒకరికొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు.  పదేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు జన్మించా రు. తొలుత  చద్మల్‌లో నివాసం ఉన్న ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న లక్ష్మి తల్లి గంగవ్వ వీరిని తగిలేపల్లికి రావాలని కోరింది. వా రు గ్రామానికి వచ్చి దినసరి కూలీలుగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం గంగవ్వ నిద్రలేచి ఆరుబయట పను లు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కుప్ప కూలింది. నిద్రలో ఉన్న కూతురు, అల్లుడు, నలుగురు చిన్నారులపై ఇటుక, సిమెంట్‌ పెళ్లలు పడ్డాయి. దీంతో గంగవ్వ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి నలుగురిని బయటకు తీశారు. అప్పటికే లక్ష్మి, ఆమె కుమారుడు సాయికుమార్‌ మరణించారు. లక్ష్మి భర్త, ముగ్గు రు కూతుళ్లను ‘108’లో బోధన్‌ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్ల గా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి, తండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నా రులు సంజన(8), అశ్విని(5), పండు(3) బోధ న్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌ పంపించారు. రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పునాది లేకుండా నిర్మించిన గోడ వల్లే దుర్ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్‌ పోచారం
తగిలేపల్లి ఘటన గురించి టీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్పీకర్‌ ఫోన్‌ ద్వారా ఘటన వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులైన మరో ముగ్గురికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

చిన్నారులను పరామర్శించిన సీపీ
బోధన్‌టౌన్‌(బోధన్‌): వర్ని మండలం తగిలేపల్లిలో గోడ కూలిన ఘటనలో గాయాలపాలై బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పరామర్శించారు. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, చిన్నారులు సంజనశ్రీ, వైష్ణవి, స్నిగ్ధ(పండు) గాయాల పాలయ్యారు. ఇందులో సంజనశ్రీ, వైష్ణవిలు బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా స్నిగ్ధను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారులను పరామర్శించిన సీపీ వారి ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్‌ అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్‌ రెడ్డి, సీఐ పల్లె రాకేశ్‌ ఉన్నారు. 

మెరుగైన వైద్య సేవలందించాలి
గోడకూలిన ఘటనలో గాయాల పాలైన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం వైద్యులకు సూచించారు. గాయపడిన చిన్నారులను పరామర్శించారు. అలాగే టీఆర్‌ఎస్‌ నేత పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. 

మరిన్ని వార్తలు