నెత్తురోడిన రహదారులు

28 Jan, 2019 14:07 IST|Sakshi

జిల్లాలో ఆదివారం పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు  అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కుటుంబ పోషణ నిమిత్తం వివిధ పనులు చేసేవారు. ఒకరు ఆటో బాడుగ తెచ్చుకునేందుకు వెళుతూ.. మరొకరు బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కులా ఉంటూ.. అలాగే కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా భార్యా పిల్లల్ని బాగా చూసుకోవాలనే ఆశతో దేశంకాని దేశం వెళ్లి సెంట్రల్‌ ఏసీ పనులు చేస్తూ విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయాడు. అలాగే ఓ మహిళ కూడా కువైట్‌లో ఈనెల 3న ఊపిరాడక చనిపోయింది. కుటుంబానికి ఆసరాగా ఉండే వారు వివిధ ప్రమాదాల్లో చనిపోవడంతో ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటే హృదయం ద్రవిస్తుంది.  

వైఎస్‌ఆర్‌ జిల్లా  , కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై పందిళ్లపల్లె సమీపంలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన బీ వెంకట సుబ్బారెడ్డి(21) తన ద్విచక్ర వాహనంలో కమలాపురం నుంచి ఎర్రగుంట్లకు వెళ్తుండగా.. గుంతకల్లు నుంచి ఐరన్‌ ఓర్‌ లోడ్‌తో కడప వైపు వస్తున్న లారీ పందిళ్లపల్లె వద్ద ఢీ కొంది. ఈ సంఘటనలో వెంకట సుబ్బారెడ్డి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై స్థానికులతో ఆరా తీశారు.  అనంతరం శవ పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..
మైదుకూరు రూరల్‌ : మండలంలోని జంగంపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం ఢీకొని తువ్వపల్లె రామాంజనేయులు (25) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం టీఓ పల్లెకు చెందిన తువ్వపల్లె సావిత్రి కుమారుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం మండలంలో ఆటో బాడుగ డబ్బులు తెచ్చుకునేందుకు బైక్‌లో వెళుతుండగా వనిపెంట సమీపంలోని జంగంపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మైదుకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు