విధి విలాపం..!

22 Aug, 2018 12:58 IST|Sakshi
మృతులు సక్కమ్మ, వీరారెడ్డి, గోపిరెడ్డి(ఫైల్‌) 

అనారోగ్య సమస్యలే కారణం

పేద కుటుంబంలో పెను విషాదం

విధి విలాపం అంటే ఇదేనేమో. అసలే పేదలు.. ఆపై అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పూటగడవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. వైద్యం చేయించుకోలేక మృత్యువుకు తలవంచారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ..పేద కుటుంబంలో పెనువిషాదం అలుముకుంది. 

నడిగూడెం(కోదాడ) : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామానికి చెందిన మర్ల గోపిరెడ్డి (70), సక్కమ్మ (65) దినసరి కూలీలుగా పనిచేస్తూ తమకున్న నలు గురు సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. కాలగమనంలో అనారోగ్య సమస్యలతో ముగ్గురు కుమారులు వెంకట్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తనువు చాలించారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వీరారెడ్డి(42)తో బతుకుబండిని లాగిస్తున్నారు. 

ఒకరి వెంట ఒకరు..

అసలే పూట గడవని దైన్యంలో బతుకీడుస్తున్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సక్కమ్మ ఈ నెల 19న మృతిచెందింది. ఆమెకు దహనసంస్కారాలు నిర్వహించిన అనంతరం కు మారుడు వీరారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

అతడిని అదే రోజు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గత సోమవారం తనువుచాలించాడు. వీరారెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నా రు.  ఓ వైపు జీవిత భాగస్వామి, మరోవైపు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇక లేరనే చేదు నిజాన్ని గోపిరెడ్డి జీర్ణించుకోలేక అతను కూడా మంగళవారం మృతిచెందాడు. రోజుల వ్యవధిలో ముగ్గురిని మృత్యువు కబళించడంతో ఆ పేద కుటుం బంలో పెను విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు