మాజీ డ్రైవరే సూత్రధారి

26 Feb, 2020 08:22 IST|Sakshi
చోరీ, నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

కొలిక్కి వచ్చిన జూబ్లీహిల్స్‌ చోరీ కేసు

ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగతనం

ముగ్గురినీ అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.34లో నివసించే వ్యాపారవేత్త నసీర్‌ అలీఖాన్‌ ఇంట్లో చోటు చేసుకున్న చోరీ కేసును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి ఆ ఇంట్లో పని చేసి మానేసిన డ్రైవరే సూత్రధారిగా తేల్చారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి చోరీ సొత్తు య«థాతథంగా స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 

ఆనుపానులన్నీ తెలుసుకుని..
బోరబండ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ యూసుఫ్‌ మూడో తరగతితో చదువు మానేశాడు. కొన్నాళ్లు ఎస్సార్‌నగర్‌లో టైలరింగ్‌ పని చేసి.. 2007లో వివాహానంతరం డ్రైవర్‌గా మారాడు. తొలుత ఎస్సార్‌నగర్‌లోని ఓ ట్రావెల్స్‌లో పని చేసిన యూసుఫ్‌ ఆపై జూబ్లీహిల్స్‌కు చెందిన కన్‌స్ట్రక్షన్స్‌ వ్యాపారి నసీర్‌ అలీఖాన్‌ వద్ద డ్రైవర్‌గా చేరారు. 2013లో ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి 2015లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఏడాది ఓలా క్యాబ్స్‌లో డ్రైవర్‌గా చేసినా.. మళ్లీ నసీర్‌ అలీఖాన్‌ వద్ద చేరాడు. గత ఏడాది జూలైలో మానివేసే సమయానికి రెండు దఫాల్లో దాదాపు ఎనిమిదేళ్లు నసీర్‌ అలీ ఖాన్‌ వద్ద పని చేశాడు. ఈ నేపథ్యంలోనే వారి ఇంట్లో అణువణువూ తెలిసి ఉండటంతో పాటు ఏ సమయంలో ఎలా ఉంటారనే దానిపైనా అవగాహన పెంచుకున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతగాడు తన మాజీ యజమాని ఇంట్లో చోరీ చేస్తే భారీ మొత్తం దక్కతుందని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన బోరబండ వాసులు షేక్‌ షాహిద్, సయ్యద్‌ షహబాజ్‌లకు చెప్పడంతో వాళ్లూ అంగీకరించారు. రంగంలోకి దిగిన ఈ త్రయం చోరీ చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వినియోగించడానికి కత్తి, ఫెన్సింగ్‌ కట్‌ చేయడానికి భారీ కత్తెర ఖరీదు చేసుకున్నారు. 

నగలున్న హ్యాండ్‌బ్యాగుతో ఉడాయింపు..  
అదను కోసం ఎదురు చూస్తున్న యూసుఫ్‌ ఇప్పటికీ నసీర్‌ అలీ ఖాన్‌ ఇంట్లో పని చేస్తున్న వారితో ఫోన్‌ ద్వారా సంభాషిస్తూ యజమానుల కదలికల్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఏ దశలోనూ వారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ నెల 14న వీరికి ఫోన్‌ చేసిన యూసుఫ్‌ పనివాళ్ల ద్వారా తమ యజమానురాలు ఓ ఫంక్షన్‌కు వెళ్లినట్లు తెలుసుకున్నాడు. ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆమె ఖరీదైన జ్యువెలరీ ధరిస్తారని, తిరిగి వచ్చిన తర్వాత అన్నీ తన హ్యాండ్‌బ్యాగ్‌లోనే ఉంచి బెడ్‌ పక్కనే పెట్టుకుంటారని తెలిసిన యూసుఫ్‌ రంగంలోకి దిగాడు. తన ఇద్దరు స్నేహితుల్నీ పిలిపించి అంతా కలిసి అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. గోడ దూకి లోపలకు ప్రవేశించిన ఈ త్రయం సీసీ కెమెరాల్లో తమ కదలికలు కనిపించకుండా వాటిని పక్కకు తిప్పారు. నేరుగా రెండో అంతస్తులోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన యూసుఫ్‌ అక్కడ ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకుని రావడంతో ముగ్గురూ కలిసి ఉడాయించారు. ఆ సమయంలో అదే ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నా.. వారికీ చోరుల ఉనికి తెలియలేదు.

మరుసటి రోజు చోరీ విషయం గుర్తించిన నసీర్‌ అలీ ఖాన్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్ల కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్‌ ముజఫర్‌ అలీ ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు మంగళవారం ముగ్గురినీ పట్టుకుని రూ.10.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు