పోర్న్‌సైట్లో అప్‌లోడ్ చేస్తానని.. పోలీసులకు చిక్కాడు

18 Aug, 2018 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమ పేరుతో మూడేళ్లుగా నమ్మించి యువతిని మోసం చేయడమే కాకుండా.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మార్ఫింగ్‌ ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెరించిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలు.. హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుని వినీష్ ప్రేమించానని నమ్మించాడు. మూడేళ్లుగా ప్రేమపేరుతో సన్నిహితంగా ఉన్నట్టు నటించాడు. అదే సమయంలో ఆమె తనతో ఉన్న కొన్ని ఫోటోలను తన వద్దే భద్రపరుచుకున్నాడు.

యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్‌‌లో ఫోటోలు పెడతానని ఆమెను బెదిరించాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలి తండ్రి పెద్ద వ్యాపారవేత్తకావడంతో అతడికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే  నీ కూతురు ఫోటోలను పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై వీనీష్‌తో ప్రియురాలి తండ్రి రూ. కోటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు. కోటి రూపాయాలను ప్రియురాలి తండ్రి నుండి వసూలు చేసుకోవాలని  వీనీష్ ప్లాన్ చేసుకొన్నాడు. 

అయితే ఈ విషయాన్ని ప్రియురాలి తండ్రి పోలీసులకు చెప్పడంతో, పోలీసులు సినిమా సన్నివేశాలను తలపించేలా పక్కా ప్లాన్‌తో నిందితుల కోసం స్కెచ్‌ గీశారు. దీనిలో భాగంగానే ప్రియురాలి తండ్రి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయాల్లో తొలుత రూ.25 లక్షలు చెల్లిస్తానని వీనీష్‌ను నమ్మించారు. ఈ రూ.25 లక్షలను తీసుకొనేందుకు  వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వచ్చారు. అయితే  వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వ్యాపారవేత్త నుండి రూ. 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్‌ అయిన వారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్ హైవే వరకు వెంటాడి వారిని పట్టుకుని, రూ. 25 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.

తన కూతురు ఫోటోలను మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతామని బెదిరింపుల వస్తున్నాయని, తమకు ఆత్మహత్యే శరణ్యమని యువతి తండ్రి ఆగష్టు 9న తమకు ఫిర్యాదు చేశారని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ముందుగా టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేస్తే వారు ఒక్కో ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిందన్నారు. దీంతో ఓ పథకం ప్రకారం యువతి తండ్రి సహకారంతో నిందితులను పట్టుకోగలిగామని తెలిపారు. 3 సెల్ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్సనల్‌ ఫోటోలు, డేటా విషయంలో జాగ్రత్త వహించాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు