ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

15 Sep, 2018 04:13 IST|Sakshi

ఆపరేషన్‌లో 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో గురువారం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు కఠువా జిల్లా నుంచి అంతర్జాతీయ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించి.. జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళుతున్న ఓ ట్రక్కులోకి ఎక్కారని  జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్‌ జమ్వాల్‌ తెలిపారు.  డొమైల్‌ అనే గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు తనిఖీలు చేపట్టడం చూసి వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యారని వెల్లడించారు. సమీపంలోని అటవీప్రాంతంలో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ మొదలుపెట్టామన్నారు. ఉగ్రవాదులను చూసినట్లు ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. గాయపడ్డ 12 మంది భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు