ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం

8 Feb, 2018 15:49 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు,ఇన్‌సెట్‌లో తండ్రీకొడుకుల మృతదేహాలు

 ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

 అక్కడికక్కడే ముగ్గురు మృతి

 హైవే నిర్వహణ సంస్థ, కారు డ్రైవర్‌ అజాగ్రత్తతో గాలిలో కలిసిన ప్రాణాలు

అంతసేపు ఆనందంగా గడిపారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఇల్లు చేరుతామనుకున్నారు.. అంతలోనే రోడ్డుప్రమాదం వారింట విషాదాన్ని నింపింది. గుడిహత్నూర్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

గుడిహత్నూర్‌(బోథ్‌) : మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు, మృతుడి మిత్రులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌కు చెందిన స య్యద్‌ అహ్మద్‌ (43) గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తరుచూ ముప్కాల్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం భార్య ఫర్హానాబేగం, కొడుకు సయ్యద్‌ ఉమర్‌ (9) కూతురు మహదియాతోపాటు డ్రైవర్‌ బిలాల్‌ (22) ఎర్టీగా వాహనంలో ముప్కాల్‌లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తిరుగు ప్రయాణంలో నిర్మల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్‌కు బయలు దేరారు.

మండల కేంద్రం దాటిన తర్వాత తెలంగాణ దాబా వద్ద హైవే స్పీడ్‌ ట్రాక్‌పై ఓ లారీ టైరు పగలడంతో ఆగి ఉంది. ఇది గమనించని కారు డ్రైవర్‌ లారీని రాత్రి 11 గంటల సమయంలో ఢీకొట్టాడు. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ముందు సీట్లో కూర్చున్న తండ్రీకొడుకులు సయ్యద్‌ అహ్మద్, సయ్యద్‌ ఉమర్, డ్రైవర్‌ బిలాల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ఫర్హానాబేగం, కూతురు మహదియాకు తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించి క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఓ కుటుంబం ప్రమాదానికి గురికావడం వీరిలో తండ్రీకొడుకులు చనిపోవడం..మృతుడి భార్య, కూతురు తీవ్రంగా గాయపడడంతో సన్నిహితులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.కిరణ్‌కుమార్‌ తెలిపారు.

నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది
హైవేపై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన హైవే పెట్రోలింగ్‌తోపాటు సదరు హైవే నిర్వహణ సంస్థ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమైంది. లారీ టైరు పేలి మరమ్మతు కోసం గంటల తరబడి హైవే స్పీడ్‌ ట్రాక్‌పై నిలిచి ఉంది. వెంటనే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆయా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో పాటులారీ డ్రైవర్‌ కనీసం ఇండికేటర్లు, ఇతరాత్ర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ చీకట్లో కనిపించలేదు. కారు డ్రైవరు సైతం అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కంటే ముందే పలువురు లారీ చీకట్లో కనిపించక వాహనాన్ని అదుపు చేసుకొని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఇరువురి నిర్లక్ష్యం మూడు ప్రాణాలను తీసింది.

మరిన్ని వార్తలు