వైద్యుడినంటూ మాట్రి‘మోసం’!

4 Jul, 2018 09:41 IST|Sakshi

పెళ్లంటూ నగర మహిళకు రూ.3 లక్షల టోకరా

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో మాట్రిమోనియల్‌ మోసం వెలుగులోకి వచ్చింది. భారత్‌ మాట్రిమోనీ వెబ్‌సైట్‌ కేంద్రంగా ఇది చోటు చేసుకుంది. లండన్‌లో వైద్యుడిగా పని చేస్తున్న ఎన్‌ఆర్‌ఐనంటూ నమ్మించిన మోసగాడు ఓ మహిళ నుంచి రూ.3 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు ప్రారంభించారు. భారత్‌ మాట్రిమోనీ సైట్‌లోని ‘డివోర్సీ’ కేటగిరీలో సిటీకి చెందిన 42 ఏళ్ల మహిళ రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో తన ప్రొఫైల్‌ సైతం అప్‌లోడ్‌ చేశారు. దీనిని చూసిన ఓ వ్యక్తి డాక్టర్‌ అశోక్‌ జేమ్స్‌ అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తాను లండన్‌లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐనని నమ్మించి, మీ ప్రొఫైల్‌ నచ్చిదంటూ పెళ్లి చేసుకుందామని సందేశం ఇచ్చాడు.

నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఇద్దరూ కొన్ని రోజుల పాటు వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్‌ చేసుకున్నారు. ఆమె తనను పూర్తిగా నమ్మిందని నిర్థారించుకున్న తర్వాత ‘డాక్టర్‌ అశోక్‌’ అసలు కథ ప్రారంభించాడు. లండన్‌ నుంచి కొన్ని బహుమతులు పంపిస్తున్నానంటూ మెసేజ్‌ పంపాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమెకు ‘రిలయబుల్‌ అసీస్‌ కొరియర్‌ ఎక్స్‌ప్రెస్‌ అండ్‌ ఫ్లైట్‌’ సంస్థ న్యూఢిల్లీ బ్రాంచ్‌ నుంచి అంటూ ఓ ఫోన్‌ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన విలువైన బహుమతులు తమ సంస్థలో నిలిచిపోయాయని, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ చేయాల్సి ఉందని ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆమె అశోక్‌కు ఫోన్‌ ద్వారా సంప్రదించగా... నిజమేనని చెప్పిన అతగాడు పన్నులు చెల్లించి ఆ బహుమతులు తీసుకోవాలని, చెల్లించిన మొత్తాన్ని సైతం తాను పంపిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో సదరు మహిళ గుర్తుతెలియని వ్యక్తులు చెప్పినట్లే కస్టమ్స్, పౌండ్స్‌ ఇన్సూరెన్స్, జీఎస్టీ, వ్యాట్‌ క్లియెరెన్స్‌ తదితరాల కింద దాదాపు రూ.3 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. డబ్బు లేకపోవడంతో  తన వద్ద ఉన్న బంగారం విక్రయించి మరీ చెల్లించారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి మంగళవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసునమోదైంది. నిందితుడు వినియోగించినబ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్‌నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు