దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌

17 Feb, 2019 07:55 IST|Sakshi
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నగదు

రూ.49 వేల నగదు, బంగారు నగలు స్వాధీనం

రాజమహేంద్రవరం క్రైం: వృద్ధ దంపతులను చంపుతామని బెదిరించి వారి నుంచి బంగారు నగలు, నగదు చోరీ చేసిన కేసులో ముగ్గురి నిందితులను రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం రాజమహేంద్రవరం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ వైవీ రమణ కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కడియపు లంక గ్రామ శివారు, నేషనల్‌ హైవే రోడ్డు గంగుమళ్ల సత్యనారాయణ నర్సరీ ఎదురుగా ఉన్న శ్రీ సత్యభవానీ ఆంధ్ర భోజన హోటల్‌ నిర్వాహకులు వృద్ధ దంపతులైన పెనుమాక సత్యనారాయణమ్మ, ఆమె భర్త నాగేశ్వరరావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి కత్తి చూపించి చంపుతామని బెదిరించి సత్యనారాయణమ్మ వద్ద ఉన్న బంగారు నగలు, రూ.49 వేల నగదు చోరీ చేశారని తెలిపారు. ఈ సంఘటన పై కడియం పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 12వ తేదీన కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా సూపరింటెండెంట్‌ షిమూషీ బాజ్‌పేయ్‌ ఆదేశాల మేరకు సౌత్‌ జోన్‌ డీఎస్పీ సీహెచ్‌ విజయ భాస్కరరావు ఆధ్వర్యంలో కడియం పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బీవీ సుబ్బారావు వారి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 15వ తేదీన కడియం ఇన్‌స్పెక్టర్‌ వారి సిబ్బంది, సీసీఎస్‌ సిబ్బంది కడియం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాకినాడ కెనాల్‌ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కేశవరం వైపు నుంచి కడియం వైపునకు మోటారు సైకిల్‌ పై వస్తున్న ముగ్గురు నిందితులను తనిఖీలు చేయగా వారు పారిపోవడానికి ప్రయత్నించారని వివరించారు. కడియం పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వారి సిబ్బంది నిందితులైన యానాంకు చెందిన కాలే మాణిక్యాలరావు,  పాలెపు సురేష్, గంగాబత్తుల దుర్గబాబు లను అరెస్ట్‌ చేశారన్నారు. ఈ ముగ్గురూ వ్యసనాలకు బానిసలై దేవాలయాల్లోని హుండీల్లో నగదు చోరీ చేస్తుంటారని వివరించారు. ఇప్పటి వరకు వీరిపై కేసులు లేవని తెలిపారు. నిందితుల నుంచి రెండున్నర కాసుల బంగారు గొలుసు, అరకాసు లక్ష్మీదేవి ఉన్న బంగారు ఉంగరం, అరకాసు బంగారు చెవి దిద్దులు, ఒక సెల్‌ ఫోన్, రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిలను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు.

రెక్కీ నిర్వహించి చోరీ
నిందితులు వారం రోజులు ముందుగా అదే హోటల్‌లో మద్యం సేవించి చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు అడిషనల్‌ ఎస్పీ వై.వి.రమణ కుమార్‌ తెలిపారు. వృద్ధ దంపతులు ఒక్కరే ఉండడంతో చోరీ చేయడం సులువని గ్రహించి నిందితులు ఈ నెల 11న దంపతులను కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు చోరీ చేసి పరారయ్యారని తెలిపారు. చోరీ అనంతరం కాకినాడ తదితర ప్రాంతాల్లో వీరు తిరిగారని వివరించారు. నాలుగు రోజుల్లోనే నిందితులను చాకచక్యంగా అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి నగలు, నగదు రికవరీ చేసిన పోలీస్‌ సిబ్బందికి అవార్డులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌత్‌ జోన్‌ డీఎస్పీ సీహెచ్‌ విజయ భాస్కరరావు, కడియం పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బీవీ సుబ్బారావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వరప్రసాద్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు