రక్షించండి.. కాపాడండి..

29 Mar, 2018 11:17 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో అన్బళగన్‌. దాడికి పాల్పడిన దుండగులు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను వెంటాడుతూ కత్తితో దాడిచేస్తున్న దృశ్యాలు

ప్రాణభయంతో హెడ్‌కానిస్టేబుల్‌ పరుగులు

పట్టాకత్తితో దుండగుల దాడి

రక్షక భటులకే రక్షణ కరువు

ముగ్గురు పాతనేరస్తుల అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘రక్షించండి.. కాపాడండి.. అంటూ మంగళవారం అర్ధరాత్రి చెన్నై మందవల్లిలోని ఓ ప్రాంతం మార్మోగిపోయింది. ముగ్గురు దుండగుల చేతిలో తీవ్రమైన కత్తిపోట్లకు గురై ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యారు. కాపాడండీ అని ఎవరైనా కేకలు వేస్తే సహజంగా పోలీసులు వచ్చి రక్షిస్తారు. అయితే కానీ సాక్షాత్తు పోలీసు హెడ్‌కానిస్టేబులే ప్రాణభయంతో పరుగులు పెడుతూ కాపాడండి అంటూ ఆర్త నాదాలు చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో నేరాల అదుపునకు పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ వాహనాల తనిఖీలు, రాత్రివేళల్లో గస్తీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పూందమల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే అన్బళగన్‌(45) కొందరు కానిస్టేబుళ్లు, స్థానిక యువకులను తోడుగా పెట్టుకుని మంగళవారం రాత్రి తన మోటార్‌ సైకిల్‌పై తిరుగుతూ గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎవరికి వారు బృందాలుగా విడిపోయిగస్తీ జరుపుతున్నారు.

రాత్రి 12.30 గంటల సమయంలో  హెడ్‌కానిస్టేబుల్‌ అన్బగళన్‌ ఒంటరిగా నిలుచుని వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొద్ది దూరంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు వ్యక్తులను గమనించి పిలిచాడు. అయితే సదరు వ్యక్తులు అన్బళగన్‌ వద్దకు రాకపోగా హేళనగా వ్యవహరించారు. దీంతో అతనే వారి వద్దకు వెళ్లి పిలిస్తే రారా అని గదమాయించాడు. సదరు వ్యక్తులు అన్బగళన్‌నే బెదిరించి తమ వాహనాలపై బయలుదేరబోయారు. అన్బగళన్‌ వారిని అడ్డగించి తన సెల్‌ఫోన్‌ కెమెరాలో ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఆ సెల్‌ఫోన్‌లోని ఒక ప్రత్యేక యాప్‌లోకి ముగ్గురి ఫోటోలు అప్‌లోడ్‌ చేసినట్లయితే వారంతా పాత నేరస్తులా కాదా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. మూడో వ్యక్తికి ఫోటో తీస్తుండగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు అన్బగళన్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని ‘మమ్మల్నే దారికాచి ఫోటోలు తీస్తావా’ అంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అయినా ఏమాత్రం వెరవని అన్బళగన్‌ తమాయించుకుని ముగ్గురుని పట్టుకునే యత్నం చేయగా వారిలో ఇద్దరు బైక్‌లో పారిపోగా ఒకడు మాత్రం రహస్యంగా తన వద్ద దాచుకున్న పొడవాటి పట్టా కత్తితో పొడిచాడు.

ఈలోగా బైక్‌లో పారిపోయిన వారు సైతం వెనక్కు తిరిగి వచ్చి అన్బగళన్‌పై దాడిచేయడం ప్రారంభించడంతో ‘కాపాడండీ.. కాపాడండీ’ అంటూ కేకలు పెడుతూ అన్బగళన్‌ రోడ్డుపై పరుగులు తీసాడు. దుండగులు సైతం ఆయన వెంటపడి తీవ్రంగా దాడులు చేశారు. అదే సమయంలో ఏదో వాహనం అవైపు రావడంతో దుండగులు ముగ్గురు తమ వాహనాల్లో పారిపోయారు. ఈలోగా గస్తీ విధుల్లో ఉన్న మిగతా కానిస్టేబుళ్లు అక్కడి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ అన్బళగన్‌ను స్టాన్లీ ఆస్పుత్రిలో చేర్చారు. దుండగులు అన్బగళన్‌ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లడంతో దాని సిగ్నల్స్‌ ఆధారంగా సతీష్‌కుమార్‌ (31), పన్నీర్‌సెల్వం (24), రంజిత్‌ (22) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ అధికారిపై హత్యాయత్నం, దారి దోపిడి సెక్షన్లపై కేసులు పెట్టారు. దుండగులు ముగ్గురూ దోపిడీలు, దొంగతనాలు, హత్యకేసుల్లో నిందితులని విచారణలో తేలింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా