ఐపీఎల్‌ చూసి వెళుతూ అనంత లోకాలకు..

28 Apr, 2019 08:59 IST|Sakshi
చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న కారు..ముగ్గురు యువకులు దుర్మరణం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసి తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా చిన్నకుప్పం సమీపంలో శనివారం జరిగింది. తిరువారూరు జిల్లా మన్నార్‌కుడి తాలూకా వడవూరుకి చెందిన కన్నదాసన్‌ (42), సేలం జిల్లా ఏర్కాడుకు చెందిన మహాలింగం (32), అరుణ్‌కుమార్‌ (35), బాలమురుగన్‌ (35), కేరళలోని పాలక్కాడు వాసులు సునీల్‌ (37), కృష్ణదాస్‌ (37), సతీష్‌ (28)లు తిరుప్పూరులోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.

వీరు చెన్నైలో జరిగిన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు శుక్రవారం తెల్లవారుజాము 2 గంటలకు కారులో బయలుదేరారు. సేలానికి చెందిన బాలమురుగన్‌ కారును నడిపాడు. రాత్రి ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి శనివారం తెల్లవారుజామున తిరుప్పూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం 6 గంటల సమయంలో విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపంలో పెట్రోలు బంకు నుంచి రోడ్డుపైకి వచ్చిన లారీ వీరి కారుని ఢీకొంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా డ్రైవింగ్‌ సీటులో ఉన్న బాలమురుగన్‌తోపాటు అరుణ్‌కుమార్, సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన నలుగురిని కల్లకురిచ్చి ప్రభుత్వాసుపత్రిలో స్థానికులు చేర్పించారు. వీరిలో కన్నదాసన్, కృష్ణదాస్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సేలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, చిన్నసేలానికి చెందిన రమేష్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు