జయరాం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

27 Feb, 2019 02:22 IST|Sakshi
నిందితులు నగేష్, విశాల్‌

హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో ఎస్‌ఆర్‌నగర్‌ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ నేనావత్‌ నగేష్‌ అలియాస్‌ సింగ్‌ అలియాస్‌ బాబుసింగ్‌(35), ఆయన మేనల్లుడు విస్లావత్‌ విశాల్‌(20), సుభాష్‌చంద్రారెడ్డి(26) ఉన్నారు. మంగళవారం ఇక్కడ దర్యాప్తు అధికారి కేఎస్‌ రావుతో కలసి వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. జయరాంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి ముందుగానే పథకం వేసుకొని గత నెల 29న ఎస్‌ఆర్‌నగర్‌ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ నేనావత్‌ నగేష్‌ అలియాస్‌ సింగ్‌ అలియాస్‌ బాబుసింగ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఇందుకోసం నగేష్‌ తన మేనల్లుడు విస్లావత్‌ విశాల్‌(20)ని రాకేశ్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాకేశ్‌రెడ్డి దిండుతో జయరాం ముఖంపై ఒత్తిపెట్టి ఊపిరాడకుండా చేయగా విశాల్‌ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించిన ఘటనను నగేష్‌ వీడియో తీశాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లా న్యూటౌన్‌ శేషాద్రినగర్‌కు చెందిన లక్ష్మిరెడ్డి సుభాష్‌చంద్రారెడ్డి(26) అల్వాల్‌ పంచశీల్‌కాలనీలోని హైటెన్షన్‌ రోడ్డులో ఉంటున్నాడు. బీటెక్‌ చదువుకున్న సుభాష్‌చంద్రారెడ్డి ఆఫీస్‌ అసిస్టెంట్‌గా రాకేశ్‌రెడ్డితో కలసి ఉంటున్నాడు. సుభాష్‌చంద్రారెడ్డి సిమ్‌నే రాకేశ్‌రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలకు వాడుతున్నాడు. అదే ఫోన్‌తో వీడియోలను సుభాష్‌చంద్రారెడ్డికి పంపించాడు. ఈ ముగ్గురు జయరాం హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జయరాంను బెదిరించి ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్‌ చేశారు. ఆ తర్వాతనే చంపేద్దామనుకున్నారు. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌ వద్ద బెదిరించి తెప్పించిన డబ్బులతోపాటు సంతకాలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకున్నారు.

హత్యకు ముందు ఒక ఇన్‌స్పెక్టర్, ఆ తర్వాత మరో ఇన్‌స్పెక్టర్‌ సలహాలను రాకేశ్‌రెడ్డి తీసుకున్నాడు. ఈ హత్య కేసులో ఐదుగురు పోలీసు అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంబాబులతోపాటు మరో వ్యక్తి వివరణ తీసుకున్నారు. శిఖాచౌదరిని ఏడు గంటలపాటు విచారించగా, జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా తన పాత్ర ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. రూ.1.3 కోట్లు శిఖా కోసం తాను ఖర్చు చేసినట్లు రాకేశ్‌రెడ్డి చెప్పగా అలాంటిదేమీ లేదని శిఖా కొట్టిపారేసింది. శిఖాచౌదరి స్నేహితుడు సంతోష్‌ ద్వారా రాకేశ్‌రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం హత్యకేసులో టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై ఇంకా విచారిస్తున్నారు. జయరాం హత్య కేసులో శిఖాకు సంబంధముందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు