వేర్వేరు సంఘటనల్లో ముగ్గురి అదృశ్యం

3 Jun, 2019 07:59 IST|Sakshi
వంశీ కిరణ్‌ (ఫైల్‌) సానియా బేగం (ఫైల్‌) మహేశ్వరి (ఫైల్‌)

దూద్‌బౌలి: వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన సంఘటన ఆదివారం నగరంలో చోటు చేసుకుంది. వీరిలో ఒక యువకుడు కాగా, మరో ఇద్దరు యువతులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగానికని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన హుస్సేనీఆలం పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పురానాపూల్‌ శివ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన శంకర్‌ రావు కుమారుడు వంశీకిరణ్‌ (23) గత నెల 9న ఉద్యోగానికని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే 31న ఫేస్‌బుక్‌లో ‘ఐ యామ్‌ గోయింగ్‌ టూ డై’ అంటూ పోస్టు చేశాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తన కుమారుడు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌: 040–27854793 నంబర్‌లో సమాచారం అందించాలన్నారు.

బహదూర్‌పురాలో...
బహదూర్‌పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నర్సింహా రావు తెలిపిన వివరాలు.. కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షర్ఫుద్దీన్‌ ఖాన్‌ కూతురు సానియా బేగం (20) గత నెల 31న ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడం లేదని తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. 

నాన్నమ్మతో కలిసి పింఛన్‌ కోసం వచ్చి..
మేడ్చల్‌: నానమ్మతో కలిసి పింఛన్‌ డబ్బుల కోసం గ్రామం నుంచి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన ఘటన మేడ్చల్‌లో జరిగింది. మేడ్చల్‌ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన ఎం.మహేశ్వరి(21) తన నానమ్మ కిష్టమ్మతో కలిసి శనివారం ఉద యం 10 గంటలకు గ్రామం నుంచి మేడ్చ ల్‌కు వచ్చి పింఛన్‌ డబ్బు తీసుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ చెక్‌పోస్ట్‌ వద్దకు వెళ్లారు. మహేశ్వరి తన నానమ్మ కిష్టమ్మను గండిమైసమ్మకు వెళ్లే ఆటోలో పంపి తాను శ్రీరంగవరం గ్రామానికి వెళ్తున్నానని చెప్పింది. అయితే ఆమె ఇంటికి రాలేదు. ఆదివారం వరకు మహేశ్వరి తిరిగి రాకపోవడంతో తండ్రి సత్యనారాయణ మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు