వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

8 Aug, 2018 13:40 IST|Sakshi
బోనాల రాజు (ఫైల్‌), తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలైన స్రవంతి, మానస 

భార్య చనిపోయిందని ఒకరు, అప్పుల బాధతో ఇద్దరు బలవన్మరణం

మూడు గ్రామాల్లో విషాదఛాయలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంగళవారం ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట, రాయపర్తి మండలం కాట్రపల్లి, జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వనపర్తి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

సంగెం: భార్య చనిపోయిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్గూర్‌రంగంపేట గ్రామానికి చెందినబోనాల రాజు (35), రజిత దంపతులు స్రవంతి, మానస కుమార్తెలతో జీవనం సాగిస్తున్నారు. రాజు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగాయి.

మనస్తాపం చెందిన రజిత ఈ ఏడాది ఏప్రిల్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాజు నెల రోజుల క్రితం పురుగుల మందుతాగి చికిత్స పొందాడు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ పురుగుల మందు తాగి పడిపోయాడు. తండ్రి పోశయ్య అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి హుటాహుటిన 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఆగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సంపత్‌రావు తెలిపారు. 

అనాథలైన కుమార్తెలు..

తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె స్రవంతి 9వ తరగతి, చిన్న కుమార్తె మానస 6వ తరగతి చదువుతున్నారు. వీరిని చూసుకోవడానికి మంచాన పడిన తాత పోశయ్య, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రలను కోల్పోయిన బాలికలను చూసిన వారంత గుండలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులను ప్రభుత్వం చేయూతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు. 

కాట్రపల్లిలో వృద్ధుడు..

రాయపర్తి:  అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాయపర్తి ఎస్సై శ్రీధర్‌ కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎండీ.వలీపాషా(60)కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిల్లు చేసి అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆతహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాజ్‌మహ్మద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ తెలిపారు.

వనపర్తిలో రైతు..

లింగాలఘణపురం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన చుంచు రాజు (30) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పత్తి చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. రాత్రి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లిన సమీప రైతులు గమనించి చూడగా అప్పటికే చనిపోయాడు.

మృతుడు రాజుకు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు, 18 నెలల కొడుకు ఉన్నాడు. కొడుకు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అయినప్పటికీ ఆరోగ్యం బాగుపడకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు