పాసుపుస్తకం కోసం ముగ్గురి ఆత్మహత్యాయత్నం

12 Feb, 2019 03:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పురుగుల మందుతాగిన అన్నా, ఇద్దరు చెల్లెళ్లు 

మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స

కేసముద్రం: తమకు వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయకపోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లాల రవికుమార్‌ తన తండ్రి చంద్రయ్య ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. వారసత్వంగా వచ్చిన భూమిలో కుమారుడు రవికుమార్‌ సాగు చేసుకుంటున్నాడు. భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు రాలేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తనకున్న 3.12 ఎకరాల భూమికి గాను రైతుబంధు ద్వారా రెండు విడతల్లో పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం నుంచి బాధితుడికి మూడెకరాలకు సంబంధించిన డబ్బులు అందాయి. మిగతా భూమిని రికార్డు ల్లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని  అధికారులను కోరుతూ వచ్చాడు.

ఈ క్రమంలో సోమ వారం రవికుమార్, తన చెల్లెళ్లు రాజమ్మ, లలిత కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో íఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ అక్కడున్న రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. అధికారులు స్పందించకపోగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా మాట్లాడటంతో రవికుమార్‌ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగబోగా, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఆటోలో ఆ ముగ్గుర్ని ఇంటికి పంపించారు. డబ్బులు ఇవ్వటం లేదనే సాకుతోనే అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా రోజూ ఆఫీస్‌ చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు మనోవేదనకు గురయ్యారు. ఇంటికి చేరుకున్న అన్నా, ఇద్దరు చెల్లెళ్లు్ల తమ భూమి సమస్య పరిష్కారం కాదని మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు వారిని 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు