ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

19 Aug, 2019 09:26 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన మినీ వ్యాన్‌

సాక్షి, ప్రత్తిపాడు రూరల్‌ (తూర్పు గోదావరి): రెప్పతీస్తే జననం.. రెప్ప మూస్తే మరణం అన్నాడో కవి. నిద్ర మరణానికి మరో రూపం అంటారు. అదే వారి కొంపముంచింది. కొత్తగా టాటా ఏస్‌ కొనుక్కున్న సంబరంతో మిత్రులతో కలసి తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా దాన్ని నడుపుతున్న చెల్లుబోయిన మరిడియ్యకు నిద్రమత్తుతో రెప్ప పడగా రోడ్డుపక్కన ఆటోను ఢీకొన్నాడు. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాస్‌ టాటా ఏస్‌ కొనుక్కొన్నాడు. అదే గ్రామానికి చెందిన పదకొండుమంది బంధు మిత్రులతో శనివారం రాత్రి తలుపులమ్మవారి దర్శనానికి బయల్దేరాడు. అమ్మవారిని దర్శించుకొని ఆదివారం వారు తిరుగుప్రయాణమయ్యారు.

సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెంది న చెల్లుబోయిన మరిడియ్య (ఆటో డ్రైవర్‌) (36), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపల్లి ఏడుకొండలు (42) మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి ప్రత్తిపాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎ.రవికుమార్‌ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీజీహెచ్‌లో క్షతగాత్రులు
కాకినాడ: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆదివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌కు  తీసుకువచ్చారు. యాండ్ర హరికృష్ణ, యాంత్ర పరమేష్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన శివప్రసాద్, బొంతు సత్య శ్రీనివాసరావుతో పాటు వ్యాన్‌ డ్రైవర్‌ రాపాక శ్యామ్‌బాబులను జీజీహెచ్‌కు తీసుకురాగా యాంత్ర పరమేష్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యులు చెబుతున్నారు. వీరందరినీ అత్యవసరవిభాగంలో ఉంచి  వైద్యసేవలందిస్తున్నారు.

గాజులగుంటలో విషాదం
పి.గన్నవరం:
ధర్మవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామానికి చెందిన మట్టపర్తి ఏడుకొండలు (చిన్న) (52) మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీ పని చేసుకొనే ఏడుకొండలుకు భార్య పద్మావతి, కుమార్తెలు వర్ణిక, మౌనిక ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఏడుకొండలు గ్రామంలో అం దరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణ వార్తను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు.

మట్టపర్రు శోకసంద్రం
మలికిపురం(రాజోలు):
ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామానికి చెందినవారి అల్లుడు మరణించడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం వార్త ఆదివారం రాత్రి గ్రామస్తులకు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లుబోయిన వీర వెంకట సత్యనారాయణ కొబ్బరి ఒలుపు కార్మికుడు. అతని భార్య, కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశంలో ఉంటున్నారు. మరొక మృతుడు చెల్లుబోయిన మరిడియ్య ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అరుణ ఉపాధికోసం విదేశాల్లో ఉంటోంది. మరిడియ్య కుమార్తె బాలదుర్గకు వివాహం కాగా కుమారుడు శ్రీరామ కృష్ణ చదువుకుంటున్నాడు.

గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ, వెంకట రమణలకు మరిడియ్య అల్లుడు. వెంకట రమణకు స్వయానా సోదరుడు. చిన్నప్పటి నుంచి అక్కే అతనిని పెంచి పెద్ద చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. మరిడియ్య మరణంతో వెంకట రమణ– సత్యనారాయణ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక మృతుడు మట్టపల్లి ఏడుకొండలు మట్టపర్తికి చెందిన యాండ్ర సత్యనారాయణకు అల్లుడు. అతను శనివారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. ఏడుకొండలు బావ మరిది హరి కృష్ణ, బంధువులతో కలిసి లోవ వెళ్లాడు. ఏడుకొండలు స్వగ్రామం పి. గన్నవరం మండలం గాజుల గుంట. అల్లుడి మృతి వార్త తెలిసి అత్తింటి వారు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు బావమరిది హరి కృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామం అంతా రోదనలతో నిండి పోయింది. ఆదివారం అర్ధ రాత్రి వరకూ బంధువులకు మృతి వివరాలు తెలియ లేదు.  

మరిన్ని వార్తలు