ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. ముగ్గురు మృతి

1 Jan, 2020 15:40 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. సోమవారం, మంగళవారం ఈ మంటలు అధికమవ్వడంతో మంటల్లో చిక్కుకొని ముగ్గురు మృతిచెందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే బాటెమన్స్​ బేలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతులను తండ్రీకొడుకులుగా గుర్తించారు. మూడవ వ్యక్తిని న్యూ సౌత్ వేల్స్ దక్షిణ తీరంలో బుధవారం ఉదయం కాలిపోయిన కారులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇటీవల కాలంలో న్యూసౌత్​వేల్స్​లో మంటలకు చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. కాగా ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే.  మంటల నుంచి తప్పించుకోడానికి  దాదాపు నాలుగు వేల మంది పర్యాటకులు స్థానికంగా ఉన్న బీచ్‌లోకి పరుగులు తీశారు. ఈ మంటలు 4 మిలియన్‌ హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణానికి వ్యాపించాయి.

ఇక వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోజు రోజుకి మంటల తీవ్రత పెరిగిపోతుంది. మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఆకాశమంతా ఎర్రగా మారింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నాయి. మంటలు ఇప్పటికీ చెలరేగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగేలా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం కాస్త వాతావరణం చల్లబడటంతో  వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపులోకి తీసుకువస్తున్నారు. కేవలం న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో మాత్రమే 100 చోట్ల మంటలు వ్యాపించాయి. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్‌ బాంబ్‌లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్‌ వేల్స్‌ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం పేర్కొంది. ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు