చిత్తైన యరపతినేని అనుచరుల ఎత్తుగడలు

23 Mar, 2019 13:17 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ప్రత్యర్థులపై హత్యానేరం మోపి రాజకీయంగా లాభం పొందాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల పథకం బెడిసికొట్టింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని అనుచరుల వద్ద పోలీసులు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ముప్పన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కారణంగా యరపతినేని ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. నాటు తుపాకులతో పాటు వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ మహిళ విషయంలో వివాదాలే ముప్పన మర్డర్‌ స్కెచ్‌కు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక నిన్న యరపతినేని నామినేషన్‌ కార్యక్రంలో కూడా ముప్పన పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో తమలో తమకు తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా ముప్పనను హతమార్చి ఆ నేరాన్ని ప్రత్యర్థులపై నెట్టి వేయాలని యరపతినేని అనుచరులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్లాన్‌ చివరి నిమిషంలో అరెస్టుతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా యరపతినేని శ్రీనివాసరావు తన ధనదాహాంతో ప్రజలనూ, ప్రత్యర్థులనే కాక సొంత పార్టీ నేతల్నే బలి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి గురజాలలో అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నసంగతి తెలిసిందే. తన పర భేదం లేకుండా... వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ)

మరిన్ని వార్తలు