అత్తింటివారికి పదేళ్ల జైలు   

2 May, 2018 12:52 IST|Sakshi

అదనపు కట్నం కోసం వేధింపులు

భరించలేక వివాహిత ఆత్మహత్య

భర్త, అత్త, మామలకు శిక్ష ఖరారు

సిద్దిపేటటౌన్‌/నంగునూరు(సిద్దిపేట) : అదనపు కట్నం కావాలంటూ వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామలకు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్ట రేణుకను నంగునూరు మండలం నర్మెట గ్రామానికి చెందిన పుట్ట రాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 50 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 60 వేల విలువైన వెండి వస్తువులు కట్నంగా ఇచ్చారు.

వీరికి ఒక కొడుకు, కూతురు జన్మించారు. పెళ్లయిన ఏడాది నుంచే భర్త రాజు, అత్త, మామలు ఐలవ్వ, చంద్రయ్యలు అదనపు కట్నం రూ. 50 వేలు తేవాలంటూ వేధించారు. ఈ విషయం రేణుక తల్లిదండ్రులకు తెలియడంతో పెద్దల సమక్షంలో రెండు, మూడు సార్లు పంచాయతీ పెట్టి రేణుకను కాపురానికి పంపించారు. అయినా రాజు కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధించడం ఎక్కువ కావడంతో తట్టుకోలేక 2015 అక్టోబర్‌ 12న వంట గదిలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన భర్త, అత్త, మామలు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అదనపు కట్నం తేవాలని హింసించడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత రేణుక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. రేణుక ఇచ్చిన మరణ వాంగ్మూలం మేరకు రాజగోపాల్‌పేట ఎస్సై గోపాల్‌రావు కేసు నమోదు చేశారు.

అనంతరం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌ కేసును పరిశోధించి రేణుక భర్త పుట్ట రాజు (30), అత్త ఐలవ్వ (50), మామ రాజయ్య(60)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసు విచారణ చేసి  కోర్టులో చార్జిషీట్‌ వేయగా అప్పటి నుంచి కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నిందితులపై నేరం రుజువైన నేపథ్యంలో జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి ప్రతిమ నేరస్తులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 54 వేల జరిమానా విధించారు.  

మరిన్ని వార్తలు