గాలిపటం దారమే.. యమపాశమై 

7 Jan, 2020 04:15 IST|Sakshi
కౌశిక్‌ మృతదేహం

గుంటూరు నగరంలో చిన్నారి ఉసురు తీసిన గాలిపటం మాంజా 

తండ్రితో బైక్‌పై వెళ్తుండగా మెడకు చుట్టుకున్న దారం 

తండ్రి ఒడిలోనే ప్రాణాలు వదిలిన కౌశిక్‌  

గుంటూరు ఈస్ట్‌: అమ్మమ్మ ఇంటికెళ్దామని ఎంతో సంతోషంగా తండ్రితో బయల్దేరిన ఆ చిన్నారిని గాలిపటం దారం యమపాశమై పొట్టనపెట్టుకుంది. నాన్నా.. ఈ రోజు స్కూల్‌కి సెలవు.. అమ్మమ్మ ఇంటికెళ్లి ఆడుకుంటా అని కొద్దిసేపటి క్రితం ముద్దులొలుకుతూ చెప్పిన మూడేళ్ల కొడుకు.. గాలిపటం మాంజా చుట్టుకుని తన ఒడిలోనే కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ తండ్రి కన్నీరుకు అంతేలేదు. గుంటూరు నగరంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

గుంటూరు నగరం కాకుమానువారితోట నాలుగో లైన్‌కు చెందిన తలకొండపాటి దుర్గారావు ప్రైవేట్‌ కంపెనీలో చిరుద్యోగి. దుర్గారావు దంపతులకు ఆదిత్య(5), కౌశిక్‌(3)లు సంతానం. సోమవారం పాఠశాలల బంద్‌ కావడంతో సెలవు ప్రకటించారు. దుర్గారావు ఇద్దరు కొడుకులను అత్తగారింట్లో వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెద్దకుమారుడు ఆదిత్యను ద్విచక్రవాహనం వెనుక.. కౌశిక్‌ను ముందు కూర్చోబెట్టుకున్నాడు. 

అమ్మమ్మ ఇంటికి చేరకుండానే..
అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన చిన్నారి కౌశిక్‌ గమ్యం చేరలేదు. మరికొద్ది నిమిషాల్లో అమ్మమ్మ ఇల్లు చేరేలోపే ఎవరో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఎగురవేసిన గాలిపటం దారం ఆ పిల్లవాడి పాలిట యమపాశమైంది. బైక్‌ లాంచస్టర్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్దకు చేరేసరికి.. సమీపంలోని పిల్లలు ఎగురవేసిన గాలిపటం దారం కౌశిక్‌ మెడకు చుట్టుకుంది. వాహనం వేగంగా వెళ్లడం వల్ల కౌశిక్‌ మెడకు దారం గట్టిగా బిగుసుకుని మెడ కోసుకుపోయింది. కొడుకు గట్టిగా అరవడంతో ఉలిక్కిపడ్డ దుర్గారావు వాహనం ఆపి దారాన్ని తొలగించాడు. స్థానికుల సాయంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కౌశిక్‌ మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు.అమ్మమ్మ ఇంట్లో సరదాగా ఆడుకోవాల్సిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు