వివాహానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి..

22 Feb, 2018 09:10 IST|Sakshi
సాయికృష్ణ మృతదేహాన్ని చెరువులో నుంచి తీసుకొస్తున్న స్థానికులు , సంఘటన స్థలంలో గుమిగూడిన జనం

ఈతకు వెళ్లి కుంటలో మునిగి ముగ్గురు యువకుల మృతి

ఒకరిని కాపాడబోయి.. మరొకరు మృత్యువాత

మాందారిపేటలో ఘటన

మృతులందరూ వరంగల్‌లోని కొత్తవాడ వాసులు

సరదాగా వివాహ వేడుకకు వచ్చిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరారు. బహిర్భూమికని వచ్చి ఈత కొట్టేందుకు చెరువులో దిగిన ఓ యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన మండలంలోని మాందారిపేట(తహరాపూర్‌) గ్రామంలో చోటుచేసుకుంది. మృతులంతా వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన చిన్ననాటి స్నేహితులే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

శాయంపేట(భూపాలపల్లి): వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదాతో కుంటలోకి దిగి మునిగిపోతున్న ఓ స్నేహితుడిని కాపాడబోయి మరో ఇద్దరు స్నేహితులు కూడా మృత్యుఒడికి చేరారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మాందారిపేట గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కూతురు వివాహానికి వరంగల్‌కు చెందిన బంధువులు ఆలేటి విజయ–స్వామి దంపతులతోపాటు వారి పెద్ద కుమారుడు సునీల్‌(19) హాజరయ్యారు. అతడితోపాటు అతడి చిన్ననాటి స్నేహితులు ఎనిమిది మంది పెళ్లికి వచ్చారు. భోజనాల అనంతరం సునీల్‌తోపాటు వరంగల్‌ కొత్తవాడకు చెందిన దేవులపల్లి అరుణ–సురేష్‌ దంపతుల కుమారుడు వంశీ(19),  రంగు సునీత–మార్కండేయ దంపతుల కుమారుడు సాయికృష్ణ(17) సమీపంలోని గోగుకుంటలోకి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో దేవులపల్లి వంశీ ఈత కొట్టేందుకు కుంటలోకి దిగాడు. వంశీకి ఈత రాకపోవడంతో లోతుగా ఉన్న ఆ కుంటలో మునిగిపోతూ కనిపించడంతో పక్కనే ఉన్న సునీల్‌ అతడిని కాపాడేందుకు నీళ్లలోకి దూకాడు.

సునీల్‌ను వంశీ గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోతూ కనిపించారు. దీంతో గట్టుపై ఉన్న సాయికృష్ణ మిగతా స్నేహితులకు సమాచారమిచ్చి అతడు కూడా వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. అయితే సాయికృష్ణకు కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు కలిసి సునీల్‌ను గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురు అందులోనే మునిగిపోయారు. మిగతా స్నేహితులు వచ్చేసరికే ముగ్గురు యువకులు మునిగిపోయారు. వెంటనే వారు అందులోకి దిగి మునిగిన ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే వారు మృత్యుఒడికి చేరారు. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన సాయికృష్ణ, వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 

పరకాల ఏసీపీ సుధీంద్ర, తహసీల్దార్‌ వెంకటభాస్కర్, సీఐ షాదుల్లాబాబా, ఎస్సైలు రాజబాబు, బాబుమోహన్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో మృతిచెందిన ముగ్గురిని పరకాల సివిల్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతులు సునీల్, వంశీ నర్సంపేటలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతుండగా, సాయికృష్ణ హన్మకొండలోని భద్రకాళి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. కాగా మృతుల కుటుంబాలను టీఆర్‌ఎస్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు.

మరిన్ని వార్తలు