ఉద్యోగాల పేరుతో టోకరా

15 Mar, 2019 12:04 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత మిషన్‌ పేరుతో మోసాలు

ముగ్గురి అరెస్ట్‌ కారు, ల్యాప్‌ట్యాప్‌లు, నగదు స్వాధీనం

చైతన్యపురి: ఉద్యోగాల పేరుతో యువతకు టోకరా వేస్తున్న బోగస్‌ సంస్థ బండారం బట్టబయలైంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత మిషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసిన ముగ్గురు నిర్వహకులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో ఎల్‌బీగనర్‌ ఏసీపీ పృద్వీధర్‌రావు వివరాలు వెల్లడించారు.పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం ప్రాంతానికి చెందిన బుద్దిరాజు రాధాకృష్ణకాంత్, గరికి జాన్సన్, కడప జిల్లా గంజికుంటకు చెందిన లెక్కల కవితారెడ్డి 2018లో దిల్‌సుఖ్‌నగర్‌లో జాయినస్‌ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం తెరిచారు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత మిషన్‌లో గ్రామీణ యువతకు కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని,  ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదినక కోఆర్డినేటర్‌ పోస్టుల నియామకానికి రాధాకృష్ణకాంత్‌ నేతృత్వంలోని మాదాపూర్‌లోని కోడ్‌సెట్స్‌ ఐటి సొల్యూషన్స్‌ ఇడియా లిమిటెడ్‌ సంస్థకు అనుమతి ఇచ్చిందని ప్రచారం చేసుకున్నారు.

నిరుద్యోగుల నుంచి రూ. 80 వేల చొప్పున వసూలు చేసి దాదాపు 200 మందిని మండల కోఆర్డినేటర్లు, జిల్లా కోఆర్డినేటర్లుగా నియమిస్తూ వారికి నకిలీ ఐడీ కార్డులు, నియామక పత్రాలను అందజేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వేతనాలు చెల్లించారు. అనంతరం వేతనాలు నిలిచిపోవడంతో అనుమానం వచ్చిని బాధితులు నిర్వాహకులను నిలదీయగా కేంద్ర ప్రభుత్వ నుంచి నిధుల విడుదల ఆగిపోయినట్లు తెలిపారు. దీనిపై బాధితులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్‌ఓటీ పోలీసులు గురువారం సంస్థ కార్యాలయంపై దాడి చేసి నిర్వాహకులు రాధాకృష్ణ, కవితారెడ్డి, జాన్సన్‌లను అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో 350 మందిని వీరు మోసం చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.6.07 లక్షల నగదు,  కారు,  బంగారు బ్రాస్‌లెట్, గొలుసు ఆరు సెల్‌ఫోన్లు, స్థిరాస్తి దస్తావేజులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపి తెలిపారు.

>
మరిన్ని వార్తలు