పులి చర్మం దొరికింది!

15 Jan, 2018 02:13 IST|Sakshi
పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

     బెజ్జూరులో మాయమైన పులి చర్మం.. కాసిపేటలో పట్టివేత 

     బీట్‌ ఆఫీసర్‌ భార్య, బావమరిది సూత్రధారులు 

కాసిపేట(బెల్లంపల్లి): కుమురం భీం జిల్లా బెజ్జూరులో మాయమైన పులి చర్మం మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఆదివారం పోలీసులకు లభ్యమైంది. పులి చర్మం అదృశ్యం వెనుక బీట్‌ ఆఫీసర్‌ భార్య, బావమరిది సూత్రధారులుగా ఉన్నారని ప్రాథమిక విచారణలో తేలింది. బీట్‌ ఆఫీసర్‌ పాత్రపైనా విచారణ సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కలకలం రేపిన పులి చర్మం మాయం కేసును బెజ్జూరు, కాసిపేట పోలీసులు ఛేదించారు. పులి చర్మం మాయం కేసులో సస్పెండైన బీట్‌ ఆఫీసర్‌ బిజ్జూరి రవీందర్‌ భార్య, బావమరిది ప్రధాన సూత్రధారులు కావడం చర్చనీయాంశంగా మారింది.

కాసిపేట ఎస్సై పోచంపల్లి సతీశ్, బెజ్జూరు ఎస్సై శివప్రసాద్‌ కథనం ప్రకారం.. 2016లో మహారాష్ట్రలో పులిని చంపి చర్మాన్ని తరలిస్తుండగా బెజ్జూరు ఫారెస్టు రేంజ్‌ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పులి చర్మాన్ని భద్రపర్చాల్సిందిగా అటవీశాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. అప్పటి ఎఫ్‌ఎస్‌వో వేణుగోపాల్, బీట్‌ అధికారి రవీందర్‌ గదిలో భద్రపరిచారు. గతేడాది డిసెంబర్‌లో అధికారుల బదిలీలో భాగంగా పాత కేసులకు సంబంధించి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా పులి చర్మం కనిపించకపోవడంతో విషయం బయటకు వచ్చింది.

డిసెంబర్‌ 18 నుంచి పులి చర్మం ఆచూకీ లేకపోవడంతో ఈ నెల 6న అటవీ అధికారులు బెజ్జూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సస్పెన్షన్‌లో ఉన్న రవీందర్‌పై నిఘా పెట్టి కేసు విచారణ చేపట్టారు. అందులో బీట్‌ ఆఫీసర్‌ భార్య సౌందర్య, బావమరిది దుర్గం వెంకటస్వామి పాత్ర ఉన్నట్లు సమాచారం అందడంతో వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు