బాసలు చేశాడు.. ఆశలు రేపాడు

12 Feb, 2020 08:28 IST|Sakshi
నిందితుడు వీరబాబు

ప్రేమించి ముఖం చాటేసిన యువకుడు  

మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం  

నిందితుణ్ని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

బంజారాహిల్స్‌: టిక్‌టాక్‌లో పరిచయం.. ఆపై స్నేహం.. ఇంకాస్త ముందుకు వెళితే ప్రేమ.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించడంతో ఆ యువతి నమ్మింది. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసుల ముందే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన యెల్లపు వీరబాబు అలియాస్‌ వీర (21) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జూబ్లీహిల్స్‌రోడ్‌ నంబర్‌ 46లోని మస్తాన్‌నగర్‌లో ఉంటున్నాడు. టిక్‌టాక్‌ ద్వారా అయిదు నెలల క్రితం బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఓ యువతితో (22) పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెండుమూడుసార్లు మాదాపూర్‌ ఓయో రూమ్‌కు కూడా తనను తీసుకెళ్లాడని అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు అయిదు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీరబాబును పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అయితే తనకు న్యాయం జరగలేదని వీరబాబుతో పెళ్లి చేయాలంటూ ఈ నెల 8న బాధితురాలు మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. వీరబాబును ఎస్‌ఐ యాదగిరిరావు పిలిపించి పెళ్ళి చేసుకోవాలని సూచించారు. అందుకు వీరబాబు ససేమిరా అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పోలీసుల ముందే తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. రక్తం కారుతుండగా వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతిని మోసగించిన ఘటనలో వీరబాబుపై ఐపీసీ సెక్షన్‌ 417, 420, 376 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు