ఉసురు తీసిన టిప్పర్‌

18 Feb, 2019 12:11 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ ఫయాజ్, షాన్‌వాజ్‌ల మృతదేహాలు

బంధువుల ఇంటికి వెళుతుండగా చోటుచేసుకున్న ఘటన

పరారీలో టిప్పర్‌ డ్రైవర్‌ బుజబుజనెల్లూరులో విషాదం   

నెల్లూరు , వెంకటాచలం: మండలంలోని జాతీయ రహదారి ఆదివారం రాత్రి రక్తమోడింది. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్‌ మోటార్‌బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన వెంకటాచలం మండలం కనుపూరు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్‌ నాగూరుబాషా కుమారుడు షేక్‌.రియాజ్‌ (19), షేక్‌.చాంద్‌బాషా కుమారుడు ఎస్‌కే షాన్‌వాజ్‌ (17), షేక్‌ మస్తాన్‌ కుమారుడు ఎస్‌కే ఫయాజ్‌ (17) వరుసకు సోదరులు. రియాజ్‌ కొయ్య పని చేస్తుంటాడు.

షాన్‌వాజ్‌ వెల్డింగ్‌ పనికి వెళ్లేవాడు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురూ బుజబుజనెల్లూరు నుంచి తమ బంధువుల గ్రామమైన ఇస్లాంపేటకు మోటార్‌బైక్‌పై రాత్రి ఆరు గంటల సమయంలో బయలుదేరారు. బైక్‌ కనుపూరు సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు చూసి వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

డ్రైవర్‌ పరారీ
ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనా స్థలంలో టిప్పర్‌ను వదిలేసి పొలాలు మీదుగా వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఓ డ్రైవర్‌ చేత టిప్పర్‌ను పక్కనపెట్టించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.  

అంతులేని విషాదం
రోడ్డు ప్రమాదంలో బుజబుజనెల్లూరుకు చెందిన యువకులు రియాజ్, షాన్‌వాజ్, ఫయాజ్‌లు మృతిచెందారని తెలియడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను అంబులెన్స్‌లో పోలీసు స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చారని తెలియడంతో మృతుల కుటుంబసభ్యులు రాత్రి 8.30 గంటల సమయంలో స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. నవ్వుతూ ఇంటి నుంచి వెళ్లిన యువకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటివద్దనే ఉన్న ముగ్గురు యువకులు గంటల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. సీఐ జి.శ్రీనివాసరావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసు స్టేషన్‌కు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు