భక్తులను మోసం చేస్తున్న కార్తీక్‌ అరెస్ట్‌

12 May, 2019 16:47 IST|Sakshi

సాక్షి, తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువున్న తిరుమలకు వచ్చే అమాయకపు భక్తులను టార్గెట్‌ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్‌ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫొన్‌ నంబర్లను ట్రాప్‌ చేసి.. వారికి దర్శనం చేయిస్తానంటూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు తిరుమల పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన తిరుమల టుటౌన్‌ పోలీసులు తెనాలిలో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై తిరుమల టుటౌన్‌ సీఐ వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్‌ చెడు వ్యసనాలకు అలవాటుపడి తిరుమలకు వచ్చి కొంతమందితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తిరుమలకు వచ్చే భక్తులను మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. కార్తీక్‌తో సంబంధం కలిగిన తిరుమలలోని లడ్డు దళారులు.. మఠంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామ’ని తెలిపారు.

>
మరిన్ని వార్తలు