చెవిరెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు

7 Feb, 2019 07:21 IST|Sakshi

రెక్కీ నిందితులపై కేసు నమోదు

సాక్షి, తిరుపతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటం ఫలించింది. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట బుధవారం అర్ధరాత్రి వరకు ఆయన ధర్నా చేపట్టారు. భాస్కర్‌రెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు నాగభూషణం, సిసింద్రీపై ఐపీసీ 323, 120 బీ, ఐపీసీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మీద దాడికి టీడీపీ నాయకులు కుట్ర చేయడం దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి డ్రైవర్లకి ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టానని.. తాను పెట్టిన అన్నం తిన్నవారే తనపై రెక్కీ నిర్వహించడం బాధకరమన్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందునే దాడి..
నియోజకవర్గంలోని తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి  పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్‌ ప్యాకెట్లతో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ, ఎంఆర్‌ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడ్డారు. (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతల రెక్కీ)

మరిన్ని వార్తలు