అమానుషం: దాడి చేసి నగ్నంగా నడిపించారు

4 Jun, 2018 12:46 IST|Sakshi

కోల్‌కతా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థి ర్యాగింగ్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారెవరైనా సరే విడిచిపెట్టబోమని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ ఆదివారం మీడియాకు తెలిపారు. కాగా, కోల్‌కతాలోని సెయింట్‌ క్యాథెడ్రల్‌ కాలేజీలో గత నెల 17 న ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని చితకబాదిన సీనియర్లు.. అందరి ముందు నగ్నంగా నడిపించారు. ఆపై తతంగం అంతా వీడియోలు తీసి వైరల్‌ చేశారు. బాధిత విద్యార్థి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం సభ్యుడు కావటంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది.

అసలేం జరిగింది... కాలేజీ ఫంక్షన్‌ పేరుతో సీనియర్లు విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే వసూలు చేసిన మొత్తంపై లెక్కలు చూపాలని సదరు  విద్యార్థి సీనియర్లను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్లు అతనిపై దాడి చేసి, అందరి ముందు నగ్నంగా మార్చి అవమానించారు. ఆపై వీడియోలు తీసి ఇంటర్‌నెట్‌లో పోస్టు చేశారు. విషయం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు.

మరోవైపు బాధిత యువకుడు విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై టీఎంసీ విద్యార్థి విభాగం గుర్రుగా ఉంది. అధ్యక్షురాలు జయ దత్త స్పందిస్తూ... ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై రాజకీయ విమర్శలకు దిగాయి.

మరిన్ని వార్తలు