గోకుల్‌చాట్ కేసు: పాకిస్థాన్‌లోనే ఉగ్రవాది

27 Aug, 2018 09:22 IST|Sakshi
రియాజ్‌ భత్కల్‌

గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్లకు 11 ఏళ్లు

నేడు తీర్పు వెలువరించనున్న ప్రత్యేక న్యాయస్థానం

రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలో సాగిన ‘ఆపరేషన్‌’

2008 నుంచి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది

సాక్షి, సిటీబ్యూరో: రియాజ్‌ భత్కల్‌... 2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది. 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులోనూ నిందితుడు... వీటి సూత్రధారి యాసీన్‌ భత్కల్‌కు సోదరుడు. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో రియాజ్‌ పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సైతం నిర్వహించాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) గుట్టు వెనుకా ఇతని ‘పాత్ర’ ఉంది. 2007 ఆగస్టు 25 నాటి ఆ జంట పేలుళ్లకు 11 ఏళ్లు పూర్తికాగా... చర్లపల్లి జైలులోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ పరారీలోనే ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో కీలక నిందితుడైన రియాజ్‌ భత్కల్‌ పూర్వపరాలివీవి...

ముంబై నుంచి ‘ప్రస్థానం’...
రియాజ్‌ భత్కల్‌ అసలు పేరు రియాజ్‌ అహ్మద్‌ షహబంద్రి. కర్ణాటకలోని భత్కల్‌ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్‌ ప్రభావంతో నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు ముంబైలో నివసించింది. డబ్బుపై ఆశతో ముంబై గ్యాంగ్‌స్టర్‌ ఫజల్‌–ఉర్‌–రెహ్మాన్‌ ముఠాలో చేరిన అతను బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబై, కర్నాటకలో పలు కేసులు నమోదైనా... ఒక్కసారి కూడా అరెస్టు కాలేదు. గ్యాంగ్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం కుర్లా ప్రాంతంలో ‘ఆర్‌ఎన్‌’ పేరుతో కొత్తముఠా ఏర్పాటు చేసి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. స్థానిక ప్రార్థన స్థలానికి తరచూ వెళ్లే బత్కల్‌ ఆ ప్రభావంతో (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే అతడి సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌ లష్కరే తోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాడు. ఆసిఫ్‌ రజా కమెండో ఫోర్స్‌ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్‌ రజా ఖాన్‌ సూచనల మేరకు విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బులు సమకూర్చేవాడు.  

రియల్టర్‌ అవతారం...  
ఉగ్రవాదం పేరుతో వసూలు చేసిన నిధులను దారి మళ్లించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్‌ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్‌ పరిసరాల్లో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహించాడు. భత్కల్‌ ఇండియన్‌ ముజాహిదీన్‌లో సెకండ్‌ కమాండ్‌ ఇన్‌ఛార్జ్‌ హోదాలో ఉండటంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్‌లోని ఎవరూ చేయలేకపోయారు.  

జంట పేలుళ్లలో ఇదీ పాత్ర....
పూణేకు చెందిన మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌చౌదరిæ, అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌ రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు 2007 జూలై లో హైదరాబాద్‌ వచ్చారు. అదే ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాజ్‌ భత్కల్‌ అనేక సార్లు నగరానికి వచ్చి వెళ్లాడు. అక్బర్, అనీఖ్‌ తమ టార్గెట్‌గా ఎంపిక చేసుకున్న అనంతరం రియాజ్‌ భత్కల్‌కు సమాచారం ఇచ్చారు. పేలుళ్లకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన సమావేశంలో రియాజ్‌ భత్కల్, సాదిక్‌ షేక్‌లతోపాటు అన్సార్‌ అహ్మద్‌ బాద్‌షా షేక్‌ కూడా  పాల్గొన్నాడు. ప్రణాళిక సిద్ధమైన తరవాత ఆగస్టు 23న భత్కల్‌ నగరానికి వచ్చి అప్పటికే పార్సిల్‌లో పంపిన బాంబులను అసెంబుల్‌ చేశాడు. చివరకు ఆగస్టు 25న రియాజ్‌ భత్కల్‌ గోకుల్‌ఛాట్‌లో, అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి దిల్‌శుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా... మూడోది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో కొందరు నిందితులు చిక్కడం, వారిపై విచారణ పూర్తయి తీర్పు వెలువడనున్నప్పటికీ రియాజ్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పాక్‌లో తలదాచుకున్న ఇతగాడు అక్కడి నుంచే తన సోదరుడైన యాసీన్‌ ద్వారా 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల (ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌) కథ నడిపించాడు. ఈ కేసులో యాసీన్‌ సహా మరికొందరిని గత ఏడాది దోషులుగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం విదితమే.  

‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతడి వల్లే... 
ఐఎంలో కీలకంగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్‌ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. దీనిని మరో ఉగ్రవాది సాదిక్‌ షేక్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. తద్వారా తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదించాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్‌ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికి అత్యంత పగడ్భందీగా వ్యూహరచన చేసి కథ నడిపేది తామైతే... పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రుచించని రియాజ్‌ తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్‌ పంపేవాడు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో 2008లో ఐఎం గుట్టురటైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియాజ్‌... ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా