విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ

17 Feb, 2018 12:09 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

వర్మకు పది ప్రశ్నలు సంధించిన సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్‌ వివాదానికి సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు శనివారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ పోలీసులు ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమా ఎందుకు తీశారు. సినిమాకు పెట్టుబడి ఎక్కడిది, మహిళలను అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు?. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన  పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆమెకు డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు. సినిమాకు వాడిన ఎక్విప్‌ మెంట్‌ ఎక్కడిది...అంటూ వర్మను విచారణలో ప్రశ్నించారు.

 సీఎస్‌ పోలీసులు గతంలో ఇచ్చిన నోటీసుకి వర్మ తాను ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా అంటూ అడ్వాకేట్ ద్వారా సమాచారం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు వచ్చారు. కాగా అశ్లీలానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జీఎస్టీ వెబ్‌ సిరీస్‌ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారం, చర్చల నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ మహిళలను అగౌరవపరుస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు సంబంధించి బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు పీఏ దేవి గత నెల 25న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్‌ వర్మ పేరు పొందుపరిచారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సి ఉండటంతో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముంబైలో ఉన్న రాంగోపాల్‌ వర్మకు గతంలో నోటీసులు పంపారు. వీటిలో పేర్కొన్న గడువు ప్రకారం వర్మ గత గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి, దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు నోటీసులు అందాయని, విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ రాంగోపాల్‌ వర్మ తన లాయర్‌ ద్వారా వర్తమానం పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వివరణ ఇచ్చారు. మరోసారి నోటీసులు ఇస్తే వచ్చే వారం విచారణకు వస్తానంటూ లాయర్‌ ద్వారా పేర్కొన్నారు. దీంతో రాంగోపాల్‌ వర్మకు సైబర్‌ క్రైమ్‌ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు