ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..

3 Oct, 2019 09:35 IST|Sakshi

మాజీ వీఆర్‌ఓ కుమారుడి అరెస్టు

రిమాండ్‌కు తరలించిన పోలీసులు

పరారీలో నెల్లికుదురు తహసీల్దార్‌ అనిశెట్టి పున్నంచందర్‌

సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్‌ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌ పంపించినట్లు తొర్రూర్‌ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్‌ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్‌ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్‌కుమార్‌ నెల్లికుదురు తహసీల్దార్‌ అనిశెట్టి పున్నంచందర్‌తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్లు ట్రాక్టర్‌ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్‌ కుమార్‌ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్‌ అనిశెట్టి పున్నంచందర్‌ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. 

వెలుగు చూసింది ఇలా..
బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్‌ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్‌ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్‌కుమార్‌ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్‌ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద  గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్‌ఓ పోస్టు నుంచి సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్‌ కార్యాలయంలో కిరణ్‌కుమార్‌ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు