వృద్ధాశ్రమం పేరిట చిత్రహింసలు

25 Jan, 2020 04:31 IST|Sakshi
వృద్ధాశ్రమంలో సంకెళ్లతో...

నిర్వాహకులపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు

ఇతర ఆశ్రమాలకు వృద్ధులు, మానసిక రోగుల తరలింపు

కీసర: మానసిక పరిస్థితి సరిగ్గా లేని వారు కొందరు.. మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైనవారు మరికొందరు.. పిల్లలకు దూరమైన వృద్ధులు ఇంకొందరు.. ఇలా 85 మందిని వృద్ధాశ్రమం పేరిట ఓ భవనంలో ఉంచి యజమానులు చిత్రహింసలు పెట్టేవారు. అనుమతి లేకుండానే నడుపుతున్న ఈ ఆశ్రమంలో ఇరుకు గదుల్లో అందరినీ కలిపి ఉంచి ఇబ్బందులకు గురి చేసేవారు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలో సాగుతున్న ఈ ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది.

నాగారంలోని శిల్పానగర్‌ కాలనీలో రెండు చిన్న భవనాలను జాన్‌ రతన్‌పాల్, కె.భారతి, అరుణాచలం, భాను అద్దెకు తీసుకొని నాలుగేళ్ల క్రితం మమత వృద్ధాశ్రమం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక వికలాంగులతో పాటు మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులను వారి తల్లిదండ్రులు, బంధువులు.. నిర్వాహకులకు నెలకు రూ.4,000 నుంచి 15,000 వేల వరకు ఇచ్చి ఈ ఆశ్రమంలో చేర్పించారు.  అయితే వీరికి సరిపోయే వసతులు ఇక్కడ లేకపోగా మానసిక పరిస్థితి సరిగా లేని వారిని గొలుసులతో నిర్బంధిం చారు. ఎవరైనా చెప్పినట్లు వినకుంటే నిర్వాహకులు కొట్టేవారని ఆరోపణలున్నాయి.

అధికారుల విచారణ...
రెండ్రోజుల క్రితం ఆశ్రమం నుంచి కేకలు వినిపించాయి. పక్కనే ఉన్న మోడీ అపార్ట్‌మెంట్‌వాసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడి కాలనీవాసులు వారిని పక్కకు నెట్టి లోపలికి వెళ్లి చూడగా, గదుల్లో వృద్ధులు, మానసిక దివ్యాంగులు కనిపించారు. కొందరి శరీరంపై గాయాలుండటం గమనించి నిర్వాహకులను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితమూర్తి, కుషా యిగూడ ఏసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌తోపాటు మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా సఖి కేంద్రం అధికారి పద్మావతి ఆశ్రమానికి చేరుకుని విచారణ జరిపారు. ఓ భవనంలో 22 మంది మహిళలను, మరో భవనంలోని ఇరుకు గదుల్లో 63 మంది పురుషులను ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు.

ఆశ్రమాలకు తరలింపు...
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ ఎంవి. రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆశ్రమంలోని వారిని శుక్రవారం ఇతర ఆశ్రమాలకు తరలించారు. జిల్లా వైద్యాధికారి డా.నారాయణ, మండల వైద్యాధికారి డా.సరిత వైద్య బృందంతో ఆశ్రమంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదుగురి మానసిక స్థితి బాగానే ఉండటంతో వారిని బంధువులకు అప్పగించా రు. ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు