ఇసుక తీసుకెళ్లారు.. బుక్కయ్యారు

21 Aug, 2019 12:44 IST|Sakshi

రోమ్‌: విహార యాత్ర నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే అక్కడ దొరికే వస్తువులను గుర్తుగా మనతో పాటు తెచ్చుకుంటాం. అయితే ఇలా చేసినందుకు ప్రస్తుతం ఇద్దరు ఫ్రెంచ్‌ పర్యాటకులు జైలు పాలయ్యారు. అయితే వారు తీసుకున్న వస్తువులు బాగా ఖరీదైనవో.. లేక డబ్బు చెల్లించకుండా తీసుకున్నవో కాదు. సముద్రపు ఒడ్డున దొరికే ఇసుకను తీసుకున్నందుకు ఇటలీ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్‌ చేసింది. వివరాలు.. ఇద్దరు ఫ్రెంచ్‌ యువకులు పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. అక్కడ చియా బీచ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గుర్తుగా ఉంటుందని భావించి కొద్దిగా ఇసుకను తమతో తెచ్చుకున్నారు. అయితే ఈ ఇసుకనే తమను కటకటల పాలు చేస్తుందని ఆ క్షణనా వారికి తెలియదు. తిరుగు ప్రయాణంలో విమాన సిబ్బంది వీరి దగ్గర ఇసుక ఉండటం గమనించింది. దాంతో వారి మీద కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.

అయితే తాము చేసిన తప్పేంటో తెలియక ఆ పర్యాటకులు బిక్కమొహం వేశారు. అధికారులను అడిగారు. అందుకు అధికారులు బదులిస్తూ.. ‘2017లో ఇటలీలో చేసిన ఓ చట్టం ప్రకారం పర్యాటకులు ఇసుక, గుండ్లు, రాళ్లు వంటి వాటిని తమతో తీసుకెళ్లడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఇటలీ ప్రభుత్వం 1-6ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తుంది. మీరు ఇసుక తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్‌ చేశాం’ అని తెలపడంతో ఆశ్చర్యపోవడం సదరు పర్యాటకుల వంతయ్యింది. తెలియక చేశాం.. మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అంటూ ఆ పర్యాటకులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘టూరిస్ట్‌లు స్మారక చిహ్నం అంటూ మా దేశ పర్యటక ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది ఇసుక, రాళ్లు, గుండ్లను తీసుకెళ్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడం కోసం ఇంత కఠిన చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. దీన్ని గమనించి పర్యాటకులు మా దేశ చట్టాలను గౌరవిస్తే మంచిద’ని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు