కాల్వలో బోల్తా పడిన ట్రాక్టర్‌.. తొమ్మిది మంది కూలీల దుర్మరణం

7 Apr, 2018 00:58 IST|Sakshi
ఏఎమ్మార్పీ లింక్‌ కాల్వలో పడిన ట్రాక్టర్‌ను బయటికి తీస్తున్న స్థానికులు, మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/పెద్ద అడిశర్లపల్లి/దేవరకొండ : పొట్టచేత పట్టుకుని పొద్దున్నే కూలికి బయల్దేరిన తొమ్మిది మంది గిరిజన మహిళలు కానరాని లోకాలకు వెళ్లారు. ఇళ్ల నుంచి బయల్దేరిన ఐదు నిమిషాలకే మృత్యు వాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ కాల్వలోకి పడిపోవడంతో జలసమాధి అయ్యారు. మరో పది మందికి గాయాల య్యాయి. ట్రాక్టర్‌లో పరిమితికి మించి కూలీలను ఎక్కించడం, సెల్‌ఫోన్‌ మాట్లాడు తూ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి (పీఏపల్లి) మండలం వద్ది పట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండా వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.

ఎలా జరిగింది..?
పడమటి తండా సమీపంలోని పులిచర్లలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో పని కోసం కూలీలు బయల్దేరారు. ఉదయం 6 గంటల సమయంలో సుమారు 25 మంది ట్రాక్టర్‌లో ఎక్కి కూర్చున్నారు. స్థలం సరిపో కపోవడంతో కొందరు మహిళల్ని ఇంజన్‌పై కూర్చోబెట్టారు. ఇంకొంత మంది వెనుక ఆటోలో బయల్దేరారు. ట్రాక్టర్‌ బయల్దేరి ఐదు నిమిషాల్లోపే తండాను ఆనుకొని ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లింక్‌ కాల్వలో బోల్తా కొట్టింది. పుట్టం గండి సిస్టర్న్‌ నుంచి అక్కపెల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీరు తీసుకువెళ్లే ఈ కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిని చేరుకోవడానికి ఈ కాల్వకట్టే ఆధారం. ప్రమాదం సమయంలో డ్రైవర్‌ బుచ్చిరెడ్డి ఫోన్‌ మాట్లాడుతున్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ట్రాక్టర్‌ కెనాల్‌లోకి దూసుకువెళ్తున్న సమయంలో డ్రైవర్‌ పక్కనే కూర్చున్న ఓ మహిళ బ్రేక్‌ వేసేందుకు యత్నించింది. డ్రైవర్‌ ట్రాక్టర్‌ను మళ్లీ రోడ్డుపైకి తెచ్చేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వారిలో మహిళలే ఎక్కువుండటం, వారికి ఈత రాకపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో రమావత్‌ సోనా(70), రమావత్‌ జీజా(65), జర్పుల ద్వాలీ(30), రమావత్‌ కేలి(50), రమావత్‌ కంసాలి(50), బానోతు ధరి(55), రమావత్‌ భారతి(35), రమావత్‌ సునీత(30) ఉన్నారు. రమావత్‌ బాజు(45) మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన 10 మందికి దేవరకొండ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

రూ.2 లక్షల ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.  ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన గురించి తెలియగానే సీఎం కేసీఆర్‌ తనతో మాట్లాడారని, బాధిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమి మంజూరు చేస్తామన్నారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమా?
15 మందిని ఎక్కించాల్సిన ట్రాక్టర్‌లో ఏకంగా 25 మందిని ఎక్కించారు. అదీగాకుండా డ్రైవర్‌ 15 అడుగులున్న బీటీ రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మృతుల బంధువులు చెబుతున్నారు. తాము చెబుతూనే ఉన్నా డ్రైవర్‌ పరిమితికి మించి ఎక్కించాడని వారు ఆరోపించారు. ఇదే ట్రాక్టర్లో కూలీకి వెళుతున్న హనుమ అనే యువకుడు ధైర్యం చేసి 12 మందిని కాపాడాడు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని ప్రమాదం నుంచి బయటపడినవారు తెలిపారు.

శోకసంద్రంలో తండా
పడమటి తండా వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే తండాకు చెందిన తొమ్మిది మంది చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న తండావాసులు, మృతుల బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో తండా శోకసంద్రంలో మునిగి పోయింది. మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు.

దేవుడైన పూజారి
పడమటితండా బాలాజీ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న హనుమ కూలీల పట్ల దేవుడయ్యాడు. ఈయన గుడిలో పూజలు నిర్వహించడమే కాకుండా కూలి పనులకు వెళ్తుంటాడు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌లోనే హనుమ కూడా ఉన్నాడు. ట్రాక్టర్‌ పడిపోగానే కాల్వలోంచి ఆయన 12 మంది మహిళలను ఒడ్డుకు చేర్చాడు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 25 మందిలో ఒకరిద్దరే పురుషులున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ కాల్వ నుంచి బయటపడి పారిపోయాడు. హనుమ ధైర్యసాహసాలను తెలుసుకున్న కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్‌ ఆయన్ను అభినందించారు. హనుమ పేరును రాష్ట్రపతి మెడల్‌కు సిఫారసు చేస్తామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు