అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

23 May, 2020 12:37 IST|Sakshi
పోలీసులు స్వాధీనపర్చుకున్న ట్రాక్టర్లు

ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలు

నిందితుల వద్ద నాలుగు ట్రాక్టర్లు, ట్రాలీలు, కారు స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆనంద్‌రెడ్డి

పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గుంటురు జిల్లా పిడుగురాళ్లలోని మారుతినగర్‌కు చెందిన వేముల శంకర్, కాకుమాను మండలం వల్లూరుకు చెందిన పత్తిపాటి గోపికృష్ణ, పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్‌కు చెందిన నేలటూరి ప్రకాష్, దారివేముల ఏసుబాబు, ప్రకాశం జిల్లా ముల్లమూర్‌ మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన బాలకోటిరెడ్డి స్నేహితులు. వీరంతా జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు.

పగలు రెక్కీ.. రాత్రి వేళ చోరీలు
ఈ ముఠా సభ్యులు కేవలం ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. జనావా సాలు తక్కువగా ఉన్న పదేశాలను ఎంచుకుని పగలు రెక్కీ నిర్వహించారు. రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి ట్రాక్టర్లను అపహరించుకుని వెళ్తున్నాంటారు. ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో విక్రయించుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. ఈ ముఠాపై ఉమ్మడి రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి.

పట్టుబడ్డారు ఇలా..
పెద్దఅడిశర్లపల్లి మండలం దుబ్బాతండాకు చెందిన రమావత్‌ మోహన్‌ గత మార్చి 21న తన ట్రాక్టర్‌ను ఇంటిఎదుట నిలిపి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ ట్రాక్టర్‌ను అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  గురువారం సాయంత్రం మండలంలోని రంగారెడ్డిగూడెం స్టేజి వద్ద ఎస్‌ఐ గోపాల్‌రావు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి  నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ట్రాలీలు, కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన కొండమల్లేపల్లి సీఐ పరుశురాం, గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు, కొండమల్లేపల్లి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది అన్నిమల్ల శ్రీను, హేమునాయక్, గణేశ్‌లను డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు