కారులో ట్రిపుల్‌ రైడింగ్‌కు జరిమానా

8 Nov, 2017 08:53 IST|Sakshi
జరిమానా విధించిన వాహనం, పోలీసులు పంపిన చలానా

ట్రాఫిక్‌ పోలీసుల వింత వైఖరి

విస్తుపోయిన వాహనదారుడు

పట్నంబజారు :    ద్విచక్ర వాహనంపై ముగ్గురు తిరగకూడదు...హెల్మెట్‌ పెట్టుకోవాలి..అంత వరకు ఓకే.. అయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు వింత నిబంధనలతో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నారు. కారులో కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలట.. ముగ్గురికి మించి ఎక్కకూడదట..ఇదేంటి అనుకుంటున్నారా..నిజమేనండీ. రోజుకు రెండు వందల కేసులు టార్గెట్‌...ఎవరెలా నవ్విపోతే నాకేలా...ద్విచక్ర వాహనం అయితే ఏంటీ..కారు అయితే ఏంటీ చలానా కొట్టామా...లేదా ఇదీ నగరంలో ట్రాఫిక్‌ పోలీసుల వ్యవహారం.  వివరాల్లోకెళితే..

 గుంటూరు నగరానికి చెందిన ఒక ఎనస్తీషియా డాక్టర్‌కు ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్‌ పోలీసులు చలానా పంపారు. రూ. 335 ఈ– సేవాలో కట్టాలని. త్రిపుల్‌ డ్రైవింగ్, హెల్మెట్‌ లేకుండా వాహనం నడపటం వలన జరిమానా విధించినట్లు చలానాలో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వాహనం ఏంటో తెలుసా..? కారు కావటం కొసమెరపు. AP07 CU5994 కారుకు పై విధంగా చలానా పంపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నిస్తే చలానా చెల్లించాల్సిందేననంటూ పోలీసులు సెలవిచ్చారు.

నిత్యం టార్గెట్‌ల మయం....
వాహనం ఫొటో తీసిన తరువాత మీ సేవాకు లింక్‌ చేస్తారు. ఈ క్రమంలోనై కారు నంబరు చూడకపోవటం ట్రాఫిక్‌ అధికారుల, సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. నిత్యం రెండు వందల కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటంతోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ట్రాఫిక్‌ సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని వార్తలు