అర్ధరాత్రి ఆగడాలపై నజర్‌

27 Mar, 2019 07:16 IST|Sakshi
నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌

ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

నాలుగు రోజుల్లో 9864 కేసులు నమోదు

నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: అర్ధరాత్రి రహదారులపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న వాహనచోదకులపై నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా కొన్నింటిని కట్టడి చేసే ఉద్దేశంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా 9864 కేసులు నమోదు చేసి 1031 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శాంతిభద్రతల విభాగం అధికారుల సాయంతో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో కొందర నేరగాళ్లు, అనుమానితులతో పాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్ధరాత్రి సమయాల్లో నెంబర్‌ ప్లేట్లు లేకుండా, అడ్డదిడ్డమైన నెంబర్‌ప్లేట్స్‌తో, హారన్లు, సైలెన్సర్ల ద్వారా వాయు కాలుష్యానికి కారణమవుతూ సంచరిస్తున్న వాహనాలతో పాటు ట్రిపుల్‌ రైడింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, రేసింగ్‌లపై ట్రాఫిక్‌ పోలీసులు దాడులు చేపట్టారు.

ఇందులో భాగంగా కొందరు అనుమానితులు సైతం చిక్కారు. మారేడ్‌పల్లి ట్రాఫిక్‌ పోలీసులు టివోలీ చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైవ్‌లో ఎనిమిది చైన్‌ స్నాచింగ్‌ కేసులతో సంబంధం ఉన్న మహ్మద్‌ అజీజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని బేగంపేట శాంతిభద్రతల విభాగం ఠాణాకు అప్పగించారు. అలాగే టోలిచౌకీలోని బాపుఘాట్‌ వద్ద లంగర్‌హౌస్‌ ట్రాఫిక్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఫహీమ్, మహ్మద్‌ అబ్దుల్‌ అలీం, షేక్‌ సాజిద్‌ అనే అనుమానితులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు తార్నాక స్ట్రీట్‌ నెం.1లో చేపట్టిన తనిఖీలో ఓ మైనర్‌ బుల్లెట్‌ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. వాహనాన్ని పరిÔశీలించగా నకిలీ నెంబర్‌ ప్లేట్‌ తగిలించినట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా ఉస్మానియా వర్శిటీ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో కేసును శాంతిభద్రతల విభాగానికి అప్పగించారు.  

నమోదైన కేసులు ఇలా...
ఉల్లంఘన                      కేసులు    
సక్రమంగాలేనినెంబర్‌ప్లేట్‌    6261
నెంబర్‌ ప్లేట్‌ లేకుండా        1853
హారన్‌/సైలెన్సర్‌ న్యూసెన్స్‌  662
ట్రిపుల్‌ రైడింగ్‌                 938
డేంజరస్‌డ్రైవింగ్‌               150
మొత్తం                         9864
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు    1031
శాంతిభద్రతల విభాగానికి అప్పగించినవి:    255

మరిన్ని వార్తలు