ఫైన్‌ పడుద్ది !

6 Oct, 2018 13:51 IST|Sakshi
ఈ–చాలన్‌ ట్యాబులు ప్రదర్శిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సైలు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వాహనదారులు ఇకపై గీత దాటితే.. ఫైన్‌ పడుద్ది. హైదరాబాద్‌ తరహాలో వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఇకపై తూచ తప్పకుండా పాటిం చా ల్సిందే. సిగ్నల్‌ జంప్‌లు, త్రిబుల్‌ రైడింగులు, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లకు ఇక కాలం చెల్లనుంది. వాహనదారులకు తెలియకుండానే జరిమానా నోటీస్‌ ఇంటికి అందే విధానాన్ని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో ప్రారంభించారు.

ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ–చాలన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ట్రాఫిక్‌ విభాగాన్ని మరింత ఆధునీకరించడం కోసం డిజిటలైజేషన్‌ దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రాఫిక్‌ విధులను మరితం సులభతరం కోసం, ప్రజల్లో ట్రాఫిక్‌ పోలీసుల పట్ల నమ్మకం పెంచేందుకు , వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేసేందుకు ఈ–చాలన్‌ విధానంను కమిషనరేట్‌లో అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
  
నగదు రహిత జరిమానాలు..
ట్రాఫిక్‌ విభాగంలో ఇంతవరకు అధికారులు వాహనాలను అపి చాలన్‌ రాసే విధానానికి స్వస్తి పలికినట్లు సీపీ డాక్టర్‌ రవీందర్‌ ప్రకటించారు. అధికారులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో వాహనదారుల నుంచి ఎలాంటి వసూళ్లు చేయరని, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన విధానాన్ని బట్టి జరిమానా విధిస్తారని ఆయన వెల్లడించారు. ఇందులో వాహనదారులు వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని, వారం రోజుల్లో ఆన్‌లైన్, మీసేవ, ఈసేవ, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చని సీపీ పేర్కొన్నారు.

ఎవరైనా, ఎక్కడైన ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు ఫొటో తీసి వాహనదారుడు ఏ విధమైన ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడింది ఆన్‌లైన్‌లో నమోదు చేసి జరిమానకు సంబంధించిన రశీదు పంపిస్తారని ఆయన తెలిపారు. దీంతోపాటు ఆ వాహనదారుడి వివరాలు రోడ్డు రవాణా శాఖకు అనుసంధానం చేస్తారని వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించారు, సమయం, తేదీ, జరిమానా ఎంత, జరిమాన విధించిన అధికారి తదితర వివరాలు డ్రైవర్‌తోపాటు ఓనర్‌కు మెస్సేజ్‌ రూపంలో సమాచారం అందుతుందని ఆయన వివరించారు.

ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.
ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో వాహనదారులతోపాటు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీపీ డాక్టర్‌ రవీందర్‌ కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఈ–చాలన్‌ విధానం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో ఈ–చాలన్‌ విధానం అమలవుతోందని, ఆ తర్వాత కమిషనరేట్‌ మొత్తం  అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ–చాలన్‌ ఏ విధంగా పనిచేస్తుందో కమిషనర్‌ వివరించారు. అనంతరం ట్రాఫిక్‌ ఎస్సైలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ, ట్రాఫిక్‌ ఇన్‌చార్జి డీసీపీ బిల్లా అశోక్‌కుమార్, ట్రాఫిక్‌ ఏసీపీ మజీద్, ఇన్‌స్పెక్టర్లు అంబటి నర్సయ్య, కిషోర్‌కుమార్, హనన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు