పుట్టినరోజు వేడుకలో విషాదం

28 Feb, 2019 02:49 IST|Sakshi
భవానీ ప్రసాద్, చక్రాల ప్రవీణ్, మహేందర్‌ సింహా, ఎస్‌కే సమీర్‌

చెరువులో పడి నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్థుల దుర్మరణం 

ప్రమాదం నుంచి బయటపడిన మరో ఇద్దరు 

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం

కోదాడ: పుట్టిన రోజు వేడుక విషాదం నింపింది. స్నేహితుడి బర్త్‌డే నిర్వహించేందుకు చెరువువద్దకు వెళ్లిన నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్థులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన చక్రాల ప్రవీణ్‌ (17), దుగ్యాల భవానీ ప్రసాద్‌ (17), నేరేడుచర్లకు చెందిన ఎస్‌.కె. సమీర్‌ (16), ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం పైనపల్లికి చెందిన ఎన్‌.మహేందర్‌ సింహా (17)లు కోదాడ సమీపంలోని అనురాగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో తొలి ఏడాది చదువుతున్నారు. బుధవారం చక్రాల ప్రవీణ్‌ పుట్టినరోజు కావడంతో కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు వేడుక చేసుకోవడానికి తినుబండారాలు తీసుకుని కోదాడ పెద్దచెరువు కట్టపైన ఉన్న మైసమ్మగుడి వద్దకు చేరుకున్నారు.

కేక్‌ కటింగ్‌ అనంతరం చేతులు కడుక్కోవడానికి సమీర్‌ అనే విద్యార్థి చెరువులోకి దిగాడు. కాలు జారడంతో అతను నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో కాపాడేందుకు చక్రాల ప్రవీణ్‌ చెరువులోకి దిగాడు. కానీ సమీర్‌ గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చిన ప్రవీణ్‌ కూడా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనిస్తున్న భవానీ ప్రసాద్, మహేందర్‌ సింహా, పి.ప్రవీణ్, అరవింద్‌లు వారిని కాపాడేందుకు చెరువులోకి దూకారు. అయితే చెరువు లోతుగా ఉండటంతో భవానీ ప్రసాద్, మహేందర్‌ సింహాలు నీటిలో మునిగి మృతి చెందగా పి.ప్రవీణ్, అరవింద్‌లు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో భయపడిన మిగతా విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీస్తుండటంతో స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి, కోదాడ ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో నలుగురు విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు