ప్రాణం తీసిన దాగుడు మూతలు!

2 Jun, 2019 05:06 IST|Sakshi
ప్రశాంత్‌ (ఫైల్‌), చేడెం కార్తీక్‌ (ఫైల్‌)

ఆటాడుకుంటూ చెక్కపెట్టెలో కూర్చున్న చిన్నారులు

పైనున్న బరువైన మూత పడిపోయి బయటకు రాలేకపోయిన వైనం

వారం తర్వాత దుర్వాసన రావడంతో గమనించిన విద్యార్థులు

మూత తెరచి చూడటంతో బయటపడ్డ మృతదేహాలు 

రాజవొమ్మంగి, (రంపచోడవరం): తప్పిపోయారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటారనుకున్న ఆ పిల్లలు ఓ చెక్కపెట్టెలో విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లడిల్లిపోయిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్‌ రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంలో ఈ హృదయ విదారక ఘటన శనివారం  వెలుగు చూసింది. గత నెల 25వ తేదీన చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత కుమార్‌ (11)కు అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన చీడెం కార్తీక్‌ (9)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా కలసి తిరిగారు. బయటకు వెళ్లినవారు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు జడ్డంగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ నేపథ్యంలో శనివారం గ్రామంలో కొంత మంది పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటుండగా బంతి తరగతి గదిలోకి వెళ్లడంతో అటుగా వెళ్లిన పిల్లలకు పెట్టెలోంచి దుర్వాసనతో కూడిన నీరు కారడం గమనించి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. వారు అక్కడికి వచ్చి పెట్టె తెరచి చూడటంతో విగత జీవులుగా మారిన పిల్లలు కనిపించారు. శరీరాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న కార్తీక్‌ తల్లిదండ్రులు భవాని, కన్నయ్య.. ప్రశాంత కుమార్‌ అమ్మమ్మ లక్ష్మి, తండ్రి నూకరాజు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డతీగల మండలం మట్లపాడు గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత్‌ కుమార్‌కు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో చిన్నయ్యపాలెంలోని అమ్మమ్మ పెంచుకుంటోంది. జడ్డంగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు కార్తీక్‌ స్వగ్రామం రాజవొమ్మంగి మండలంలోని నెల్లిమెట్ల. చిన్నయ్యపాలెంలో గంగాలమ్మ పండుగకు బంధువుల ఇంటికి వచ్చాడు. మృతులిద్దరూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన వారే. 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
స్నేహితులైన వీరిద్దరూ దాగుడుమూతల ఆటలాడుకుంటూ చెక్కపెట్టెలో దాక్కోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆ చెక్కపెట్టె పైన ఉండే బరువైన మూత, గొళ్లెం కూడా దానికదే పడిపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక సీఐ బి.రాజారావు, తహసీల్దార్‌ కె. శ్రీనివాస్, రాజవొమ్మంగి ఎస్సై వినోద్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు