ఓవర్‌ లోడ్‌.. అతివేగం..

26 Mar, 2018 01:22 IST|Sakshi

బావిలోకి పల్టీ కొట్టిన ఆటో- 11 మంది బలి

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం 

మృతుల్లో ఆరుగురు చిన్నారులు.. ఐదుగురు మహిళలు 

మరో తొమ్మిది మందికి గాయాలు 

19 మందిని కుక్కేసిన డ్రైవర్‌ 

ఓవర్‌లోడ్, మితిమీరిన వేగమే కారణం 

రక్షణ ఏర్పాట్లు లేకుండా రోడ్డుకు 2 మీటర్ల పక్కనే బావి 

క్షేమంగా బయటపడిన 2 నెలల చిన్నారి

సాక్షి, నిజామాబాద్, బాల్కొండ : ఓ ఆటో.. నలుగురిని మాత్రమే తీసుకెళ్లాల్సిన డ్రైవర్‌ 19 మందిని కుక్కేశాడు.. డ్రైవర్‌ సహా 20 మందితో ఆటో బయల్దేరింది.. మరో 2 నిమిషాల్లో వారంతా క్షేమంగా గమ్యస్థానం చేరుకునేవారే.. కానీ అంతలోనే మృత్యువు కాటేసింది.. ఓవర్‌ లోడ్‌కు మితిమీరిన వేగం తోడవడంతో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ఆటో పల్టీ కొట్టింది.. ఈ ఘోర దుర్ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు! మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. డ్రైవర్‌తోపాటు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురున్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మెం డోరా మండల కేంద్రం శివారులో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మృతులంతా నిజామాబాద్‌ జిల్లా వాసులే.

ఈ ఘోర ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎలా జరిగింది..?: ముప్కాల్‌ నుంచి మెండోరాకు 20 మందితో కిక్కిరిసిన ఆటో బయల్దేరింది. డ్రైవర్‌ సీటుకు కూడా ఇరువైపులా నలుగురు కూర్చున్నారు. రెండు నిమిషాలైతే ఆటో మెండోరాకు చేరుకునేది. కానీ ఇంతలోనే అతివేగం కారణంగా ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. రోడ్డుకు కేవలం రెండు మీటర్ల లోపే ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఈ బావి ఉంది. రోడ్డుకు బావికి మధ్య చిన్న పాటి కాలువ కూడా ఉంది. ఈ కాలువ గట్టును ఢీకొనడంతో కొంత ఎత్తు ఎగిరి ఆటో నేరుగా బావిలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎడమ వైపు నుంచి పడిపోవడం, ఆటోలో కుడివైపు రాడ్డు ఉండటంతో ప్రయాణికులకు బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పంటల చుట్టూ కట్టే చీరలను, దగ్గర్లో ఉన్న ఓ తాడును తెచ్చి బావిలోకి వదిలారు. తాడు, బావిలోని మోటారు పైపును పట్టుకుని తొమ్మిది మంది బయటకు వచ్చారు. మిగతా 11 మంది చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆర్మూర్, నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఓవైపు నీటిని తోడేస్తూ మరోవైపు గజ ఈతగాళ్లతో మృతదేహాల గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావు, జేసీ రవీందర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. నిర్లక్ష్యంగా ఆటోను నడిపిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం, ఓవర్‌లోడ్‌ ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

మృతుల వివరాలు.. 
1. బోప్పారం సాయమ్మ (50), వేంపల్లి 
2. మద్దికుంట లక్ష్మి (38), ధర్మోరా 
3. గుండం గంగామణి (45) కేశాపూర్‌ 
4. పెద్దోల్ల సంపత్‌ (14) మోస్రా 
5. తెడ్డు రోజ (25), చిట్టాపూర్‌ 
6. తెడ్డు ప్రశంస (7) చిట్టాపూర్‌ 
7. తెడ్డు చిన్ని (2), చిట్టాపూర్‌ 
8. తెడ్డు చక్కాని (5), చిట్టాపూర్‌ 
9. మెట్టు వినయశ్రీ (6), కొడిచర్ల 
10. మనస్విని (3), ఆలూరు 
11. గుర్తు తెలియని మహిళ 

క్షతగాత్రులు వీరే.. 
వర్ని మండలం మోస్రాకు చెందిన పెద్దోల్ల సుమలత, పెద్దోల్ల మల్లవ్వ, ముప్కాల్‌ మండలం వేంపల్లికి చెందిన బొప్పారం చిన్నరాజు, బొప్పారం విజయ, «సంజయ, ప్రవీణ, సంగీత, రెండు నెలల పసికందు మనీష్, ఆటో డ్రైవర్‌ గోపి శ్రీనివాస్‌. 

ప్రాణాలతో బయటపడ్డ రెండు నెలల చిన్నారి 
మెండోరాకు చెందిన సంగీతకు ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన మహేశ్‌తో వివాహమైంది. భర్త వ్యవసాయ కూలీ పనిచేస్తుండగా సంగీత బీడీలు చుడుతోంది. వీరికి మనస్విని (3), రెండు నెలల బాబు ఉన్నారు. ఇటీవలే పుట్టిన మనుమడిని, తన బిడ్డ సంగీతను ఇంటికి తీసుకువచ్చేందుకు మెండోరాకు చెందిన సత్తెమ్మ (45) ఆదివారం ఆలూరు వెళ్లింది. సంగీత, మనుమరాలు మనస్విని, మనవడితో ముప్కాల్‌ వరకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఆటోలో మెండోరాకు బయల్దేరింది. ఆటో బావిలో పడడంతో సత్తెమ్మ, మనస్విని మృతి చెందారు. సంగీత కాలు విరిగింది. ఆమెతోపాటు ఆమె రెండు నెలల బాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

వదినను తీసుకువస్తూ.. కోడలి పొగొట్టుకుని.. 
మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన ప్రవీణకు నిజామాబాద్‌కు చెందిన రాజుతో వివాహమైంది. ప్రవీణ వాళ్ల అన్నకు ముగ్గురు పిలల్లు. ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. వదిన, ఆమె పిల్లలు విన్యశ్రీ(6), కొడుకును వెంట తీసుకుని ప్రవీణ తమ గ్రామమైన కొడిచెర్లకు బయల్దేరింది. ముప్కాల్‌ వరకు బస్సులో వచ్చిన తర్వాత.. వదిన, ఆమె కొడుకు ఇద్దరూ దిగిపోయారు. అక్కడే చదువుకుంటున్న విన్యశ్రీని తీసుకొని ప్రవీణ ఆటోలో బయల్దేరింది. ప్రమాదంలో విన్యశ్రీ మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

మరిన్ని వార్తలు