పెళ్లి పేరుతో మోసం చేశాడు..

28 Feb, 2020 08:16 IST|Sakshi
నిందితుడు ఫెరోజిద్దీన్‌

పోలీసులకు ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు

పంజగుట్ట: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు తనను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ ట్రాన్స్‌జెండర్‌ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల, షాపూర్‌నగర్‌కు చెందిన లక్కిరాయ్‌ అలియాస్‌ శ్రీను ట్రాన్స్‌జెండర్‌. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 1లోని జీవీకె మాల్‌ సమీపంలో వ్యాపారం చేసేది. అమెకు కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన మహ్మద్‌ ఫెరోజిద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. ఫెరోజ్‌ తనను ప్రేమిస్తున్నానని చెప్పడంతో 2018 జులై 8న ఎంగేజ్‌మెంట్‌  చేసుకున్నట్లు తెలిపింది.

అనంతరం ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫెరోజ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో మరో యువతితో ఎంగేజ్‌మెంట్‌ అయిన ఫొటోలను గుర్తించిన లక్కిరాయ్‌ అతడిని నిలదీయగా, సరదాగా ఫొటోలు పెట్టినట్లు బుకాయించాడు.  అయితే ఫెరోజ్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని అతడి స్నేహితులు చెప్పడంతో గత జనవరి 8న అతడిని నిలదీసింది. ఫిబ్రవరి 14న అతడికి మరో యువతితో వివాహం జరిగిందని తెలియడంతో గురువారం బాధితురాలు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు