నయంకాని వ్యాధితో.. హిజ్రా ఆత్మహత్య

20 Oct, 2018 13:37 IST|Sakshi
పిక్కిలి రామ్మోహన్‌ మృతదేహం

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పెన్నానగర్‌లో పిక్కిలి రామ్మోహన్‌ (20) అనే హిజ్రా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెన్నానగర్‌కు చెందిన పెద్దక్కకు రామ్మోహన్‌ ఒక్కగానొక్క కుమారుడు. అతను నాలుగేళ్ల నుంచి పట్టణంలోని హిజ్రాల వెంట తిరిగేవాడు. వారితో కలిసి ప్రోగ్రాంలు, వంట చేయడానికి తరచు వెళ్లేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అతను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు నయంకాని వ్యాధి సోకినట్లు తెలిపాడు.

దీంతో అతను వైద్యుల సూచన మేరకు వ్యాధికి సంబంధించిన మందులు ఇంటికి తెచ్చుకొని రోజూ వాడేవాడు. మందు డబ్బాలను చూసిన తల్లి ఎందుకు ఇన్ని మందులు వాడుతున్నావు.. ఏమైంది అని అడిగింది. రెండు రోజుల వరకు అతను తల్లికి అసలు విషయం చెప్పలేదు. అయితే ఆమె బలవంతం చేయడంతో వ్యాధి సోకిన విషయం చెప్పాడు. ఆ రోజు నుంచి ఇక నేను బతకను.. చచ్చిపోతాను అని తల్లితో చెప్పేవాడు.

శుక్రవారం తల్లి దోసెలు తీసుకొని రాగా, కొద్ది సేపటి తర్వాత తింటానని చెప్పాడు. బయటికి వెళ్లిన పెద్దక్క గంట తర్వాత ఇంటికి రాగా రామ్మోహన్‌  ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకున్నాడు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు.  అప్పటికే అతను చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు