దివాకర్‌ బస్సు సీజ్‌

31 Dec, 2019 10:45 IST|Sakshi
సీజ్‌ చేసిన దివాకర్‌ బస్సు ఇదే

కళ్యాణదుర్గం: రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్‌ బస్సును మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు  సీజ్‌ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్‌7699 నంబర్‌ గల దివాకర్‌ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా అడ్డుకుని రికార్డులను పరిశీలించి బస్సును సీజ్‌ చేశారు. అనంతపురం– మొలకాల్మూరు రాకపోకలు సాగించే దివాకర్‌ బస్సు నిబంధనలకు విరుద్ధంగా మరో రూట్లో వస్తుండటంతో పట్టుకున్నారు.

నిబంధనల ప్రకారం సదరు నంబర్‌ గల దివాకర్‌ బస్సు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుండ్లపల్లి, రాయదుర్గం మీదుగా మొలకాల్మూరుకు రాకపోకలు సాగించాలి. అలా కాకుండా మొలకాల్మూరు నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న సదరు దివాకర్‌ బస్సు రాయదుర్గం, గుండ్లపల్లి, బెళుగుప్ప మీదుగా వెళ్ళకుండా గుండ్లపల్లి నుంచి నేరుగా కళ్యాణదుర్గంకు వస్తుండగా బళ్ళారి బైపాస్‌ రోడ్డులో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు అడ్డుకున్నారు. 38 మంది ప్రయాణికులతో వస్తున్న దివాకర్‌ బస్సును సీజ్‌ చేసి అనంతపురంలోని ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా అధిక లోడ్‌తో చిత్రదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి వస్తున్న మరో సంస్థకు చెందిన ప్రైవేటు బస్సుపై కూడా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు