ఆర్థిక ఇబ్బందులే ఉసురు తీశాయా..?

28 Jan, 2019 07:13 IST|Sakshi
రామచంద్రరావు, రేణుక మృతదేహాలు

పెళ్లయిన రెండేళ్లకే జీవితంపై విరక్తి

బావిలో దూకి గిరిజన దంపతుల ఆత్మహత్య

విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): ఇద్దరూ గిరిజనులే..ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్నారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన గడికించుమండలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ గ్రామంతోపాటు రంగశీలలోనూ విషాదం అలుముకుంది. హుకుంపేట ఎస్‌ఐ బి.నాగకార్తీక్‌ జంట ఆత్మహత్య సంఘటను దారి తీసిన వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని రంగశీల పంచాయతీ ఇరుకువలసకు చెందిన కొర్రా రామచంద్రరావు(21)సర్వీసు జీపులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే మండలం గడికించుమండకు చెందిన రేణుక(20)ను ప్రేమించి పెద్దల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరునెలల క్రితం రేణుక తన తల్లి వద్ద రూ.లక్షన్నర అప్పుచేసి భర్త రాంచంద్రరావుకు ఇచ్చింది.

ఈ సొమ్ముతో జీపు కొనుగోలు చేసి సొంతంగా నడుపుకుని  జీవించాలని భావించారు. రాంచంద్రరావు జీపు కొనుగోలు చేయకుండా ఆ డబ్బును దుబారా చేశాడు. ఓ క్రిమినల్‌ కేసులోనూ ఇరుక్కున్నాడు. పట్టుకెళ్లిన డబ్బులివ్వాలని అత్త ఒత్తిడి చేసేది. నగదు విషయమై భార్య రేణుక పలు సందర్భాల్లో అతడ్ని నిలదీసేది. తరచూ గొడవలు పడేవారు. అలాగే కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో గడికించుమండలోని అత్తవారింటికి రామచంద్రరావు రావడం మానేశాడు. ఇలా దంపతుల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో  రేణుకను కలిసేందుకు శనివారం రాత్రి 12గంటల సమయంలో రామచంద్రరావు గడికించుమండ వెళ్లాడు. దంపతుల మధ్య తగాదా చోటుచేసుకుంది.

అనంతరం భార్య రేణుకను బైక్‌పై ఎక్కించుకుని రామచంద్రరావు వెళ్లిపోయాడు. ఇద్దరూ ఇరుకువలస వెళ్లిపోయి ఉంటారని అంతా భావించారు. ఆదివారం ఉదయానికి గడికించుమండ సమీపంలోని పంట భూముల వద్ద తాగునీటి బావి  సమీపంలో రేణుక చున్నీ,సెల్‌ఫోన్‌లు కనిపించాయి. అనుమానం వచ్చిన గ్రామస్తులు హుకుంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నాగకార్తీక్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గిరిజనులు కర్రల సాయంతో బావిలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు.  శనివారం రాత్రే ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ నాగకార్తీక్‌ కుటుంబీకులను ఆరా తీయగా ఆర్థిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు