కొంపముంచిన నిల్వ మాంసం

5 Jun, 2020 08:32 IST|Sakshi
పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న బాధితులు- గాయపడిన ఎంపీడీవో ఇమ్మానుయేల్‌ను పరామర్శిస్తున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

గిరిజనుడు మృతి

27 మందికి అస్వస్థత 

విచారణకు వెళ్లిన ఎంపీడీవోపై దాడి 

పాడేరు: రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందిన మేకను కోసుకుతిన్న గిరిజనులు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురికాగా, వీరిలో ఓ గిరిజనుడు గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. హుకుంపేట మండలంలోని మారుమూల గన్నేరుపుట్టు పంచాయతీ  డొంకినవలసలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో రెండు రోజుల కిందట ఓ మేక అనారోగ్యంతో మృతిచెందడంతో బుధవారం దాన్ని కోసి, 15 కుటుంబాల వారు పంచుకుని వండుకుని తిన్నారు. గురువారం ఉదయం నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు.

వీరిలో సుడిపల్లి వెంకటరమణ (43) అనే గిరిజనుడు గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గ్రామంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప్ప ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అనూష,ఇతర వైద్యసిబ్బంది సాయంత్రం అక్కడకు చేరుకుని    27 మంది గిరిజనులకు వైద్యసేవలు కలి్పంచారు. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను డొంకినవలస గ్రామానికి తరలించి,అక్కడ నుంచి రాత్రి 10గంటల సమయంలో పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు.ఈ 27 మందిలో పరిస్థితి విషమంగా ఉన్న 9 మందికి ఉన్నత వైద్యసేవలు కల్పిస్తున్నారు. మిగిలిన వారిని కూడా రాత్రికి తీసుకువచ్చారు.అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌లు ఆస్పత్రికి చేరుకుని బాధిత గిరిజనులను పరామర్శించారు. బాధిత గిరిజనులకు మెరుగైన వైద్యసేవలకు వైద్యులతో ఎమ్మెల్యే పాల్గుణ సమీక్షించారు.  

ఎంపీడీవోపై దాడి 
డొంకినవలస గ్రామంలో బాధిత గిరిజనులకు సహాయ కార్యక్రమాలకు గాను రాత్రి 7.30 గంటల సమయంలో తరలివెళ్లిన హుకుంపేట ఎంపీడీవో ఇమ్మానుయేల్, ఇతర సచివాలయ ఉద్యోగులపై సీపీఎం నేతలు, గిరిజనులు దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు. అధికారుల వాహనాల టైర్లకు గాలి కూడా తీసేసి వాహనాలను కదలనివ్వలేదు. ఈ దాడిలో ఎంపీడీవో ఇమ్మానుయేల్‌కు కుడిచేయి విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. అతి కష్టం మీద ఎంపీడీవో, ఇతర సిబ్బందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఖండించారు. ఎంపీడీవోను కేజీహెచ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు