ఊరుకాని ఊరిలో.. మృతదేహంతో రాత్రంతా..

9 Jun, 2018 11:20 IST|Sakshi
లలిత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

అనారోగ్యంతో గిరిజన మహిళ మృతి

మృతదేహంతో రాత్రంతా మండల కేంద్రంలో జాగారాం

వైద్యసేవలు సక్రమంగా అందలేదని ఆరోపణ

కేజీహెచ్‌కి వెళ్లమని చెప్పినా వినలేదన్న వైద్యసిబ్బంది

గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. సకాలంలో వైద్యసేవలందకపోవడంతో పాటు పేదరికం కారణంగా విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందలేని నిస్సహాయ స్థితిలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గురువారం రాత్రి ఓ గిరిజన మహిళ పాడేరు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతూ  మార్గమధ్యంలో ముంచంగిపట్టు మండల కేంద్రంలో కన్నుమూసింది. దీంతో ఆమె కుటుంబం ఊరుకాని ఊరిలో మృతదేహంతో రాత్రంతా జాగారం చేయవలసి వచ్చింది.

ముంచంగిపుట్టు(అరకులోయ): ఎపిడమిక్‌కు ముందే ఏజెన్సీని వ్యా ధులు చుట్టేస్తున్నాయి. మలేరియా, విషజ్వరాలు, అతిసార లక్షణాలతో ఆదివాసీలు అల్లాడిపోతున్నారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దాబుగూడ గ్రామానికి చెందిన కొర్రా లలిత(25)అనే మహిళ జ్వరం, అతిసార లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం రాత్రి మృతి చెందింది. వైద్యసేవలు సక్రమంగా అందకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని బాధితుడు వాపోతుండగా, మెరుగైన వైద్యసేవలు కోసం విశాఖ కేజీహెచ్‌ తీసుకు వెళ్లమని అంబులెన్స్‌ సమకూర్చినా  వినిపించుకోలేదని వైద్య సిబ్బంది అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.   కొర్రా లలిత  జ్వరం, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త కుస్సో ఈ నెల 4న  లబ్బూరు పీహెచ్‌సీకీ  తీసుకువచ్చాడు. అక్కడి సిబ్బంది ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి రిఫర్‌ చేశారు. సీహెచ్‌సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యసేవలు కోసం ఈ నెల 6న పాడేరు ఏరియా ఆస్పత్రికి తరిలించారు.

అక్కడ  వైద్యసేవలు అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో  కేజీహెచ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేజీహెచ్‌కు వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేవని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లిపోతామని కుస్సో తెలిపాడు. వైద్యసిబ్బంది ఎంత చెప్పిన వినకుండా గురువారం  సాయంత్రం ముంచంగిపుట్టు వచ్చేశారు. అప్పటికే రాత్రి 10 గంటలు కావడంతో ఉదయం దాబుగూడ వెళ్లేందుకు అవకాశం లేక మండల కేంద్రంలోనే ఉండిపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో లలిత తీవ్ర అస్వస్థకు గురై  మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తెలియక, తమ ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కాక మృతదేహంతోనే రాత్రంతా ఎంపీడీవో కార్యాలయ సమీపంలో పుట్టెడు దు:ఖంతో  ఉండిపోయారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్‌ బలరాం,సీపీఎం నాయకులు శాస్త్రీబాబు,త్రినాథ్,సోనియన్న,గంగధర్‌లు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

సక్రమంగా అందని వైద్యసేవలు  : ముంచంగిపుట్టు,పాడేరు ఆరోగ్య కేంద్రాలకు తన భార్యను తీసుకు వెళ్లిన వైద్యసేవలు సక్రమంగా అందించలేదని అందుకే తన భార్య లలిత మృతి చెందిందని భర్త కుస్సో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే కేజీహెచ్‌కు పంపిస్తామని చెబితే   వినకుండా ఇంటికి   వెళ్లిపోవడంతోనే లలిత చనిపోయిందని పాడేరు వైద్య సిబ్బంది ఫోన్‌లో మండల స్థాయి అధికారులకు తెలిపారు. స్థానిక నాయకులు పాడేరు ఐటీడీఏ ఉన్నతాధికారులకు సమచారం ఇవ్వడంతో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై  వివరాలను  ముంచంగిపుట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ   రామకృష్ణ   సేకరించారు.అనారోగ్యంతో మృతిచెందిన లలిత కుటుంబానికి రూ. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.శాస్రీబాబు డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు