పురుడు పోయని ప్రభుత్వ వైద్యులు  

10 May, 2018 12:51 IST|Sakshi
ప్రాణాలతో పోరాడుతున్న నిండు గర్భిణి సోయం బేబీరాణి  

అశ్వారావుపేట, భద్రాచలం, ఖమ్మం సర్కారు ఆస్పత్రులతోపాటు..

వరంగల్‌ ఎంజీఎంలోనూ ఇదే తీరు..

అవస్థ పడుతున్న ఆదివాసీ మహిళ

అశ్వారావుపేట: ‘అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నాం. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవిస్తే నగదు ప్రోత్సాహమిస్తున్నాం.’అని ప్రభుత్వం డాంబికాలు పలుకుతోంది. కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇందుకు నిదర్శనమే ఈ గిరిజన మహిళ ప్రసవ వేదన..  

అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోయం బేబీరాణి తొలిసూరు కాన్పు కోసం వారం క్రితం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అక్కడ వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. భద్రాచలంలో కూడా ఇదే దుస్థితి ఎదురైంది. అక్కడి నుంచి కొత్తగూడెం, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రులకు తిరిగారు.

కానీ ఎక్కడా వైద్యం అందలేదు. వరంగల్‌ లేదా హైదరాబాద్‌ వెళ్లాలని ఖమ్మం వైద్యులు సూచించారు. తీవ్ర రక్తహీనత, గుండె సంబంధ వ్యాధి ఉందని, తాము వైద్యం చేయలేమని ఎక్కడికక్కడే తేల్చేశారు. కనీసం అంబులెన్స్‌ కూడా ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేద గిరిజన కుటుంబం కావడంతో దేవుడిపై భారం వేసి స్వగ్రామమైన ఊట్లపల్లికి తిరిగి వచ్చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు చందాలు పోగుచేసి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రులను ఆశ్రయించారు.

అక్కడా చేర్చుకోలేమని తేల్చేయడంతో ఆదివారం అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా అదే పరిస్థితి. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం రాత్రి 2 గంట ల సమయంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్‌ వెళ్లాలని అక్కడి వైద్యులు బయటకు పంపేశారు. చేతిలో రూ.500కు మించి లేవు. ఇంటికి రాలేరు.. వరంగల్‌ ఆస్పత్రిలో వైద్యం చేయబోమన్నారు.

హైదరాబాదు ఎలా వెళ్లాలో.. తెలియని గిరిజనులు దారి ఖర్చులకు డబ్బులు లేక ఊరు కాని ఊర్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిచిపోయారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేటకు చెందిన జ్ఞానదృష్టి ప్రసాద్‌ తన సోదరుడు, వరంగల్‌ జిల్లాలో సీఐగా పనిచేస్తున్న రామకృష్ణకు చెప్పగా.. ఆయన ఖమ్మంలో ఉన్నప్పటికీ తనకు తెలిసిన వారి ద్వారా రూ.1000 ఇప్పించడంతో ఇంటికి తిరిగి వచ్చారు.

మళ్లీ బుధవారం గ్రామస్తుల వద్ద కొంత ఆర్థిక సహాయాన్ని పొంది గర్భిణిని తీసుకుని హైదరాబాదుకు పయనం అయ్యారు. పేరుకే గిరిజన నియోజకవర్గ కేంద్రంలో సీమాంక్‌ సెంటర్, జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, భద్రాచలంలో పెద్దాసుపత్రి.. ఓ గిరిజన మహిళకు సురక్షితంగా పురుడు పోయలేని ఈ వ్యవస్థ ఎవరి కోసం..? నెలలు నిండే వరకు గర్భిణికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేయని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఆదివాసీ గిరిజనుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రంలో గిరిజనులకు వైద్యం అందట్లేదంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు