ట్రిపుల్‌ తలాక్‌ కేసు నమోదు

20 Jul, 2020 08:03 IST|Sakshi
నిందితుడు అబ్దుల్‌ సమి

నాగోలు: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం మొదటి ట్రిపుల్‌ తలాక్‌ కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా, మల్లెపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్‌ సమి రాజేంద్రనగర్‌ పీహెచ్‌సీ టీబీ విభాగంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 2017లో అతడికి హస్తినాపురం ఓంకార్‌ నగర్‌కు చెందిన హసీనాతో వివాహం జరిగింది. వీరికి  ఒక కుమారుడు. అయితే గత కొద్ది రోజులుగా అబ్దుల్‌ సమితో పాటు అతడి తల్లి అన్వరి బేగం, ఆడపడుచు పర్వీన్‌ అదనపు కట్నం కోసం హసీనాను వేధింస్తున్నారు.

దీంతో హసీనా 2019 సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  పెద్దల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం వారు  హస్తినాపురం ప్రాంతానికి మకాం మార్చారు. కాగా గత మార్చి 25న హసీనాతో గొడవ పడిన సమీ భార్యకు తలాక్‌ చెప్పి ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. దీంతో హసీనా గత జూన్‌ 26న వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 13న ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు త్రిపుల్‌ తలాక్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  అబ్దుల్‌ సమిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు